ప్రముఖ సింగర్ పేరుతో రూ.1.7కోట్లు టోకరా

By telugu news teamFirst Published Aug 12, 2020, 9:16 AM IST
Highlights

బాధితురాలు మరో నెంబర్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు అంటూ మెసేజ్ చేసింది. దీంతో... గాయని కూడా ఆమె మెసేజ్ కి స్పందించింది. అప్పటి నుంచి పలుసార్లు వాట్సాప్ లో మెసేజ్ లు చేసుకున్నారు.

ప్రముఖ సింగర్ పేరు చెప్పి.. కొందరు కేటుగాళ్లు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.1.7 కోట్లు కాజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా.. బాధితురాలు ఇటీవల రాచ కొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  కొత్తపేటకు చెందిన ఓ మహిళ(44) టాలీవుడ్ కి చెందిన ప్రముఖ గాయనికి వీరాభిమాని. 2019లో బాధితురాలి ఇంటి దగ్గరుండే  చైతన్య అనే వ్యక్తి గాయని వాట్సాప్ నంబర్ ఇచ్చాడు. రెండు, మూడుసార్లు వాట్సాప్ లో మెసేజ్ చేయగానే గాయని బాధితురాలి నెంబర్ ను బ్లాక్ చేశారు.

అయితే... బాధితురాలు మరో నెంబర్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు అంటూ మెసేజ్ చేసింది. దీంతో... గాయని కూడా ఆమె మెసేజ్ కి స్పందించింది. అప్పటి నుంచి పలుసార్లు వాట్సాప్ లో మెసేజ్ లు చేసుకున్నారు.

ఒక రోజు కేరళలో ఆనంద చేర్లాయం ట్రస్టులో రూ.50వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో.. సదరు మహిళ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ డబ్బులు గాయని సూచించిన బ్యాంక్ ఖాతాకు పంపించింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు మార్లు డబ్బులు వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫోటోలు వాట్సాప్  లో పంపించేవారు. కానీ ఎప్పుడూ వీడియో కాల్ మాత్రం మాట్లాడలేదు. మొత్తంగా రూ.1.7 కోట్లు  ఆమె వద్ద నుంచి వసూలు చేశారు. అయితే.. తాను మోసపోయానని సదరు మహిళ ఆలస్యంగా గుర్తించింది. తాను ఇంతకాలం మాట్లాడింది నిజంగా తన అభిమాన సింగర్ కాదని.. తనకు నెంబర్ ఇచ్చిన వ్యక్తే మోసం చేశారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!