సొంత తమ్మున్నే ఆస్తి కోసం అతి కిరాతకంగా చంపాడో కసాయి అన్న. ఈ దారుణం వరంగల్ పట్టణంలో చోటుచేసుకుంది.
వరంగల్ : ఒకే కడుపున పుట్టినవారి మధ్య దాగివున్న ప్రేమానురాగాలను తట్టిలేపింది బలగం సినిమా. ఆస్తులు, గొడవలతో దూరమైన అన్నదమ్ములు కూడా ఈ సినిమా చూసి ఒక్కటవుతున్నారు. ఏళ్లుగా దూరంగా వుంటున్న కుటుంబాలు కూడా ఈ సినిమా చూసి దగ్గరవుతున్నారు. అందరిని ఇంతలా కదిస్తున్న ఈ సినిమా ఆ కసాయి మనసును మాత్రం కరిగించలేనట్లుంది. ఆస్తి కోసం సొంత తమ్మున్నే అత్యంత కిరాతకంగా చంపాడో దుర్మార్గుడు. ఈ దారుణం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ పట్టణం ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ అన్నదమ్ములు. అందరికీ పెళ్లిళ్లయి వేరువేరుగా వుంటున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల నుండి సంక్రమించిన స్థలాన్ని ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. అయితే అందరిలో పెద్దవాడైన శ్రీనివాసులు మరణించగా మిగతా ఇద్దరు స్థలం కోసం గొడవపడేవారు.
చిన్నవాడైన శ్రీకాంత్ తన వాటా కింద వచ్చిన 94 గజాల స్థలాన్ని అమ్ముకోడానికి ప్రయత్నించగా అందుకు అన్న శ్రీధర్ అభ్యంతరం చెబుతున్నాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ మొదలవగా స్థలం జోలికి వస్తే చంపేస్తానని బెదిరించిన శ్రీధర్ తమ్మున్ని చితకబాదాడు. దీంతో భయపడిపోయిన శ్రీకాంత్ నిజామాబాద్ వెళ్లి కూలీపనులు చేసుకుంటూ కుటుంబంతో జీవించేవాడు. అయితే కరోనా కారణంగా ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిని, అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థలం వరంగల్ కు చేరుకున్నాడు. తన స్థలం అమ్ముకుందామని మళ్ళీ ప్రయత్నించగా సోదరుడు శ్రీధర్ మళ్ళీ తమ్మున్ని బెదిరించాడు. దీంతో చేసేదేమిలేక శ్రీకాంత్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరుడిపై శ్రీధర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. తమ్ముడి స్థలం విషయంతో జోక్యం చేసుకోనని చెప్పడంతో పోలీసులు అతడిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అన్న అభ్యంతరం లేదని చెప్పడంతో తన స్థలాన్ని అమ్మే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు శ్రీకాంత్. ఈ క్రమంలోనే శనివారం తన స్థలాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నవారిని వెంటపెట్టుకుని వెళ్లాడు. స్థలం చూపిస్తుండగా ఒక్కసారిగా శ్రీధర్ తమ్ముడిపై దాడికి దిగాడు.
శ్రీకాంత్ ను తీవ్రంగా కొడుతూ తన ఇంట్లోకి లాక్కెల్లిన శ్రీధర్ ముందుగానే తెచ్చిపెట్టుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో పూర్తిగా దగ్దమయ్యేలా తమ్మున్ని ఇంట్లోనే వుంచి బయటనుండి తలుపులు మూసేసి బండరాయిని అడ్డుపెట్టాడు. అయితే శ్రీకాంత్ ఒళ్లంతా మంటలతోనే తలుపులు తోసుకుని బయటకు రాగా రోడ్డుపైన అందరూ చూస్తుండగానే బండరాయితో మోది కిరాతకంగా హతమార్చాడు. అనంతరం భార్య బిడ్డలను తీసుకుని పరారయ్యాడు.
ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.