
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు మూలధనం కోసం నిధులు ఇచ్చి నిబంధల మేరకు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఇటీవల ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ-ఆసక్తి వ్యక్తీకరణను)ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోని వివిధ యూనిట్లను సందర్శించింది. చీఫ్ జనరల్ మేనేజర్ (ఇంఛార్జి) ఎన్‌వి స్వామి నేతృత్వంలోని వైజాగ్ స్టీల్ ప్లాం్ అధికారులు ప్లాంట్‌లోని ఉత్పత్తి సౌకర్యాలను సింగరేణి బృందానికి వివరించారు. ఈ క్రమంలోనే అనంతరం అన్ని అంశాలపై సింగరేణి అధికారులు ఓ నివేదికను తయారుచేశారు.
అయితే విశాఖ ఉక్కును కొనడంపై తెలంగాణ ప్రభుత్వం కొనడం సాధ్యం అయ్యే పని కాదని.. ఇందుకు పలు మార్గదర్శకాలు అడ్డుగా మారే అవకాశం కాదని తెలుస్తోంది. ఆర్‌ఐఎన్‌ఎల్ ఉక్కు, ఉక్కు తయారీ ముడి పదార్థాలపై ఆసక్తి ఉన్న కంపెనీలతో భాగస్వామి కావాలని చూస్తోందని ఈవోఐ నోటీసు పేర్కొంది. స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ముడిపదార్ధాలు అంటే ప్రధానంగా కోకింగ్ కోల్, బ్లాస్ట్ ఫర్నేస్ కోక్, ఇనుప ఖనిజం సరఫరా చేయగిలిగే సంస్థలను అర్హులుగా తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు. అయితే ఒకవేళ ప్రజాప్రయోజనాలరీత్యా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో పెట్టుబడులు పెట్టి సొంతం చేసుకోవడానికి టెండర్లు వేయాలంటే తప్పనిసరిగా కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుంది.
ప్రస్తుతం సింగరేణిగానీ, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థగానీ కొనడానికి అవకాశాలున్నాయా అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం జారీచేసిన ఉత్తర్వులు అడ్డంకిగా మారతాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైజాగ్ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరి అనే అధికారులు తెలంగాణ సర్కార్‌కు నివేదించినట్టుగా తెలుస్తోంది.
అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణకు ఇంకా కేంద్రం నోటిఫికేషన్ జారీచేయలేదు. కానీ ప్రైవేటీకరణ మాత్రం తప్పదని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇటీవల కూడా మరోసారి ఇదే విషయంపై స్పష్టతనిచ్చింది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఈవోఐ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రస్తావన లేదు. అయితే పెట్టుబడులను ఆహ్వానించడం ప్రవైటీకరణలో భాగమేనని మాట వినిపిస్తుంది.
ఇక, సింగరేణి సంస్థలో 51 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి ఉంటే.. 49 శాతం కేంద్రానికి వాటా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకవేళ తెలంగాణ తరఫున సింగరేణి బిడ్ దాఖలు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తప్పనిసరి అనే వాదనే వినిపిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈవోఐకు ఈ నెల 20 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనే వేచి చూడాల్సి ఉంది.