ఎల్‌బీ నగర్ ప్రేమోన్మాది ఘటన: శివ బయటకు సంఘవిని చంపేస్తాడేమో.. బాధితురాలి సోదరుడు

By Sumanth Kanukula  |  First Published Sep 4, 2023, 3:36 PM IST

హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని ఆర్టీసీ కాలనీలోని ప్రేమోన్మాది దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి  తెలిసిందే.ఈ ఘటనపై సంఘవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సోదరులు శ్రీనివాస్‌, రోహిత్‌‌ డిమాండ్ చేశారు. 


హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని ఆర్టీసీ కాలనీలోని ప్రేమోన్మాది దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి  తెలిసిందే. ఓ ఇంట్లోకి చొరబడిన ప్రేమోన్మాది శివకుమార్.. యువతి సంఘవి, ఆమె సోదరుడి పృథ్వీతేజ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి సోదరుడు ప్రాణాలు కోల్పోగా.. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సంఘవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సోదరులు శ్రీనివాస్‌, రోహిత్‌‌ డిమాండ్ చేశారు. 

సంఘవి తమ్ముడు రోహిత్ మాట్లాడుతూ.. శివకుమార్‌ 10వ తరగతి నుంచి తన అక్కను వేధిస్తున్నాడని తెలిపాడు. ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై సమాచారం అందిన వెంటనే.. ఎల్‌బీ నగర్‌కు చేరుకున్నట్టుగా చెప్పాడు. గది మొత్తం రక్తపు మరకలతో నిండి ఉందని.. శివకుమార్ వాళ్ల సోదరి కూడా తమ అక్కను వేధించినట్లుగా తెలిసిందని అన్నాడు. శివను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శివకుమార్ బయటకు వస్తే తమ అక్కను సైతం చంపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. 

Latest Videos

శ్రీనివాస్ మాట్లాడుతూ.. శివకుమార్ 10వ తరగతి నుంచే సంఘవిని వేధిస్తున్నాడని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని సంఘవి ఇంట్లో చెప్పలేదని.. చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా చేసిందేమోనని అన్నారు. శివకుమార్ అన్యాయంగా తమ తమ్ముడిని చంపేశాడని ఆరోపించారు. 

ఇదిలాఉంటే.. ఆదివారం సంఘవి నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన శివకుమార్ బీభత్సం సృష్టించాడు. సంఘవిని గాయపరచడంతో పాటు, అడ్డొచ్చిన ఆమె తమ్ముడి పృథ్వీతేజ్‌ను కత్తితో పొడిచాడు. దీంతో పృథ్వీతేజ్‌ సహాయం కోసం కేకలు వేస్తూ ఇంటి నుండి బయటకు పరుగెత్తాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బయటే  కుప్పకూలిపోయాడు. 

అయితే సంఘవి ఇంట్లో నుంచి కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బయట రక్తపు మడుగులో పడి ఉన్న పృథ్విని చూసిన స్థానికులు సంఘవిని రక్షించడానికి ఇంట్లోకి దూసుకెళ్లారు. వారు శివకుమార్‌ను పట్టుకుని, కొట్టి, మొదటి అంతస్తులోని గదిలో బంధించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.  సంఘవి, పృథ్వీలను ఆస్పత్రికి తరలించగా.. పృథ్వీ మృతిచెందినట్టుగా వైద్యులు చెప్పారు. ఇక, సంఘవిని కూడా మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన ఆమె తమ్ముడు పృథ్వీతేజ్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ఇక, పృథ్వీతేజ్ నేర చరిత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నేరేళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్.. అడ్డదారుల్లో వెళ్లొద్దని మందలించిన తండ్రిని సుత్తితో కొట్టి చంపారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. 

click me!