
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా తెలంగాణ పోరుగడ్డ వరంగల్ లో అడుగుపెట్టారు. పార్టీ ని ఉద్దరించాలనో లేక ప్రజాసమస్యలపై చైతన్యం తేవాలనో కాదు ఓ వ్యక్తిగత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో జరిగిన ములుగు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతక్క కుమారుడి వివాహానికి ఆయన వచ్చారు.అయితే ఈ వేడుకకు హాజరైన బాబుకు ఓ తెలుగు తమ్ముడు షాక్ ఇచ్చాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆర్షంస్వామి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త. తమ అధినేత చంద్రబాబు వరంగల్ రావడంతో తన ఆర్థికసమస్యలు ఆయనతో చెప్పుకోవాలని భావించిన ఆర్షంస్వామి బాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
కానీ, ఆయనతోనే ఉన్న స్థానిక టీడీపీ నేతలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన అర్షంస్వామి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అక్కడున్న తెలుగు తమ్ముళ్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరినప్పుడు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి అక్కడే ఉండటం గమనార్హం.