
జనగామ : బల్లి పడిన ఆహారం తిన్న 14 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో 8వ తరగతి విద్యార్థిని శ్రీవాణికి వడ్డించిన ఆహారంలో బల్లి ఉండడంతో తోటి బాలికలు అది గుర్తించారు. దీంతో వారు భయాందోళనలకు గురయ్యారు. అప్పటికే భోజనం చేసిన వారికి కడుపులో నొప్పి వస్తుండడంతో గురువారం బాధ్యతలు నిర్వహిస్తున్న జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు పావని 108కి సమాచారం అందించారు. రెండు అంబులెన్సులో 14 మందిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు,
తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఆందోళన
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చారు. సిబ్బంది తీరును తప్పుబడుతూ అక్కడే బైఠాయించారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లారు. పరిశీలించడానికి వచ్చిన తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఎస్సై రమేష్ నాయకులు తల్లిదండ్రులు ప్రశ్నించారు. జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను అదనపు కలెక్టర్ హమీద్, డీఈవో రాము పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం క్షేమంగా ఉందని అధికారులు తెలిపారు.
మెరుగైన చికిత్స అందించండి…
అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి దయాకర్ రావు ఆదేశించారు. అవసరమైతే అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని అన్నారు. పాఠశాలను జిల్లా పాలనాధికారి శివలింగయ్య సందర్శించాలని సూచించారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురి అరెస్ట్ రిజెక్ట్:హైకోర్టులో పోలీసుల లంచ్ మోషన్ పిటిషన్
సమస్యల కుంపటిగా కస్తూర్బా..
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కస్తూర్బా పాఠశాలలో సమస్యలు అధికంగా ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. మరుగుదొడ్లు, డార్మెటరీ సరిగా ఉండవు అని తెలిపారు. ప్రశ్నించడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించారని అన్నారు. పడుకోవడానికి స్థలం లేకపోవడంతో తరగతి గదుల్లోనే ప్రతిరోజు నిద్రిస్తున్నామని అలాంటి సమయంలో పలుమార్లు విష పురుగులు వచ్చాయని తెలిపారు. ప్రత్యేక రోజుల్లోనూ ఉడికీ, ఉడకనిఆహారాన్ని అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వసూళ్ల పర్వం
ఉపాధ్యాయులు పలు కారణాలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రతకు ఇటీవల ప్రతి విద్యార్థి నుంచి రూ.500 వసూలు చేసినట్లు దేవరుప్పుల మండలం కు చెందిన విద్యార్థిని తండ్రి గుగులోత్ ఉపేందర్ తెలిపారు. అనుకోని కారణాలతో ఆలస్యమైన ప్రతి ఒక్కరి నుంచి రోజుకు రూ.100 చొప్పున తీసుకుంటున్నారని నారాయణ చెప్పారు.