Ponguleti Srinivasa Reddy: 2014-2019 మధ్య కాలంలో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. గురువారం తెలంగాణ కాంగ్రెస్ సర్కారులో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక సాధారణ రైతు బిడ్డ నుంచి.. నేడు కేబినెట్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
Minister Ponguleti Srinivasa Reddy: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా.. ఒక రైతు బిడ్డ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్ తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. పొంగులేటి రాజకీయ ప్రస్థానం గమనిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) విధేయతగా ఉన్నప్పటికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ నుంచి వైదొలిగారు. కేసీఆర్ కు సవాల్ విసురుతూ.. కాంగ్రెస్ లో చేరి ఖమ్మంలో మెజారిటీ సీట్లను సాధించిపెట్టారు. దీంతో ఆయనకు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవి వరించింది.
పొంగులేటి వ్యక్తిగత జీవితం గమనిస్తే..
undefined
ఖమ్మం జిల్లాలోని నారాయణపురంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో 04 నవంబర్ 1965లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పొంగులేటి రాఘవరెడ్డి, తల్లి పేరు పొంగులేటి స్వరాజ్యం. ఆయన జీవిత భాగస్వామి పొంగులేటి మాధురి. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, కుమార్తె. వ్యవసాయం కుటుంబం నుంచి కాంట్రాక్టర్ గా ప్రయాణం సాగించి, రాజకీయాల్లోకి వచ్చారు.
రాజకీయ సంచలనం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత 2013లో ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పొంగులేటి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నామా నాగేశ్వరరావుపై దాదాపు 11 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే, తెలంగాణ రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో ఆయన అనుచరులుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి చేరారు.
అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వనప్పటికీ కేసీఆర్ కు విధేయత చూపారు. ఇతర నాయకులు గెలుపు కోసం కృషి చేశారు. కానీ అనూహ్యంగా అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపణలతో రాజకీయ దుమారం మొదలైంది. బీఆర్ఎస్-పొంగులేటి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన పొంగులేటి.. డైరెక్టుగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బహిరంగంగానే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి సంచలనానికి తెరలేపారు.
కాంగ్రెస్ లో చేరిక.. బీఆర్ఎస్ కు సవాలు..
అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్.. పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటివరకు విమర్శలకు పరిమితమైన పొంగులేటి.. తనను సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ లో చేరి, కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఖమ్మంలో 10 సీట్లు కాంగ్రెస్ కు అందిస్తానని తన మాటను నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. 2014-2019 మధ్య ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 56,650 ఓట్ల భారీ మెజారిటీతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.