ఆగిన వరద బాధితుల డబ్బులు... ఎన్నికల కమిషన్ కి బండి సంజయ్ లేఖే కారణమా?? సోషల్ మీడియాలో వైరల్....

By Siva KodatiFirst Published Nov 18, 2020, 6:58 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తున్న రూ.10 వేల సాయాన్ని ఎన్నికల కమీషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈసీ చర్యను తప్పుబట్టారు

తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తున్న రూ.10 వేల సాయాన్ని ఎన్నికల కమీషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈసీ చర్యను తప్పుబట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రలోభాలకు గురవుతారన్న కారణంతో ఈసీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎన్నికల కమిషన్ దానిని పరిశిలించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంపించినట్లుగా దాని సారాంశం. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ వరద బాధితులకు ఇచ్చే సహాయాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసిందట. బండి సంజయ్ లేఖతోనే ఎన్నికల కమిషన్ ఆ వరద సహాయాన్ని నిలిపివేసిందని స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

Also Read:వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్

మరోవైపు ఈ వార్తలపై స్పందించారు బండి సంజయ్. వరద సాయం ఆపాలని తాను ఎన్నికల కమిషన్‌కు తాను లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. తన సంతకం పోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని సంజయ్ ఆరోపించారు.

బీజేపీ వల్లే వరద సాయం ఆగిందంటూ టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని సంజయ్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలే తన సంతకం పోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆయన ఆరోపించారు.

వరద సాయం బీజేపీ ఆపలేదని చెప్పడానికి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం కేసీఆర్‌ ఒట్టు వేయడానికి సిద్ధమా అని బండి సవాల్‌ విసిరారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్‌ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలోనే ఏమి చేయలేని కేసీఆర్‌.. ఇక ఢిల్లీలో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు.

click me!