
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ జనజీవనాన్ని ఆస్తవ్యస్తం చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా పొంచి ఉన్న వ్యాధుల ముప్పు నేపథ్యంలో… వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. వర్షాలు, వరదల కారణంగా అంటు రోగాలు, విష జ్వరాలు వ్యాపించకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారిని కూడా వెనక్కి పిలిపించాలని డిఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేశారు. గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. వరదలతో ముంచెత్తుతున్నాయి. అనేకచోట్ల ఇళ్లల్లోకి, జాతీయ రహదారుల పైకి నీరు చేరి రాకపోకలకు ఆటంకం…జనజీవనానికి ఇబ్బందులు కలుగుతున్నాయి.
తెలంగాణలో 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఆరుగురు మృతి.. పలువురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..
ఈ నేపథ్యంలోనే వైద్య ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ ప్రజారోగ్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. వరదల ప్రభావంతో రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు డిఎంహెచ్ఓ గడల శ్రీనివాసరావు అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని ఆదేశించారు. ఇప్పటికే ఎవరైనా ఉద్యోగులు సెలవులలో ఉన్నట్లయితే వారిని కూడా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించాలని తెలిపారు. ఆరోగ్యశాఖ ఉద్యోగులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని.. విధులు నిర్వహిస్తూ ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండిఏ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని… తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లిలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, జనగాం, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, కొమురం భీమాసిఫాబాద్, అదిలాబాద్, సిద్దిపేట, మంచిర్యాల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.