పొలంలో మట్టి తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు... ఆ రైతు ఏం చేసాడంటే..

Published : Jul 26, 2023, 11:21 AM IST
పొలంలో మట్టి తవ్వుతుండగా బయటపడ్డ లంకెబిందెలు... ఆ రైతు ఏం చేసాడంటే..

సారాంశం

ఓ రైతు పొలంలో మట్టి తవ్విస్తుండగా లంకెబిందెలు బయటపడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లిలో వెలుగుచూసింది. 

భువనగిరి : ఓ రైతు పొలంలో మట్టిని తవ్విస్తుండగా లంకెబిందెలు బయటపడ్డాయి. ఇలా దొరికిన నాలుగు లంకె బిందెలను ప్రభుత్వానికి అప్పగించకుండా సదరు రైతు తనవద్దే పెట్టుకున్నాడు. అయితే కాస్త ఆలస్యమైనా ఈ లంకెబిందెల వ్యవహారం వెలుగులోకి రావడంతో వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. రైతు వద్దనుండి లంకెబిందెలను స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖకు అప్పగించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన కొలను బాల్ రెడ్డి రైతు. పది రోజులక్రితం గ్రామ సమీపంలోని తుమ్మల చెరువు వద్దగల వ్యవసాయ భూమిలో జేసిబితో మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే లంకెబిందెలు బయటపడ్డాయి. దీంతో అక్కడే వున్న బాల్ రెడ్డి ఆ నాలుగు లంకెబిందెలను తీసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ జెసిబి డ్రైవర్ నవీన్ తో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు సురేష్, ధన్ రాజ్ కు కొంత డబ్బు ఇస్తానని చెప్పి పంపించాడు. లంకెబిందెలను తీసుకుని అతడు కూడా ఇంటికి వెళ్లాడు. 

అయితే ఈ లంకెబిందెల వ్యవహారం నిన్న(మంగళవారం) వెలుగులోకి వచ్చింది. తనకు ఇస్తానన్న డబ్బులకోసం జేసిబి డ్రైవర్ ఫోన్ చేయగా బాల్ రెడ్డి స్పందించకపోవడంతో లంకెబిందెలు దొరికిన విషయాన్ని అతడు తెలిసినవారికి చెప్పాడు. దీంతో ఈ వార్త ఆ నోట ఈ నోట ప్రచారమై గ్రామస్తులందరికీ తెలిసిపోయింది. అంతేకాదు వాట్సాప్ గ్రూప్స్ లో కూడా లంకెబిందెల వార్త చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వ్యవహారం పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లింది. 

Read More  హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. లాభాలు విదేశాలకు మళ్లింపు, హెన్రీ కోసం గాలింపు

పిలాయిపల్లి గ్రామస్తుల నుండి సమాచారం సేకరించగా అధికారులు లంకెబిందెలు దొరికింది నిజమేనని తేలింది.దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బాల్ రెడ్డికి లంకెబిందెలు దొరికిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం తహసీల్దార్ వీరాభాయి రైతు బాల్ రెడ్డికి దొరికిన బిందెలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనకు ఖాళీ బిందెలు మాత్రమే దొరికాయని... అందులో  బంగారం గానీ ఎలాంటి వస్తువులు గానీ లేవని రైతు చెబుతున్నాడని తహసీల్దార్ వెల్లడించారు. నిజంగానే ఖాళీ బిందెలు దొరికితే వాటిని రైతు ఎందుకు అధికారులకు అప్పగించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అయితే ఈ లంకెబిందెల వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. రైతు బాల్ రెడ్డితో పాటు జేసిబి, ట్రాక్టర్ డ్రైవర్లను అధికారులు విచారిస్తున్నారు. దొరికినవి ఖాళీ బిందెలా లేక అందులో ఏమయినా వున్నా రైతు అబద్దం చెపుతున్నాడా అన్నది విచారణలో తేలనుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !