చంద్రబాబు భారీ షాక్: టీఆర్ఎస్ లోకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ

By telugu teamFirst Published Jun 7, 2021, 3:19 PM IST
Highlights

తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగలనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణనే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగలనుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. రమణను పార్టీలో చేర్చకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పచ్చజెండా ఊపారు. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఎల్. రమణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆయన టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవిని చేపట్టారు. ఈ సాన్నిహిత్యం దృష్ట్యా రమణ ఎర్రబెల్లి దయాకర్ రావుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన బీసీ నాయకుడిగా ఈటెల రాజేందర్ స్థానం సంపాదించుకున్నారు. ఈటెల రాజేందర్ పార్టీకి రాజీనామా చేయడం వల్ల రమణను చేర్చుకుని, ఆ ఖాళీని భర్తీ చేయాలని కేసీఆర్ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు గులాబీ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు 

ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కారణంగా ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఈ స్థితిలో రమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ రాజీనామా వల్ల ఉత్తర తెలంగాణలో పట్టు కోల్పోకుండా చూసుకోవడానికి టీఆర్ఎస్ లోకి రమణను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితికి టీడీపీ చేరుకుంది. పోటీ చేసినా నామమాత్రమే అవుతోంది. ఈ స్థితిలో రమణ తన వ్కక్తిగత రాజకీయ జీవితంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున రమణ పనిచేశారు. కానీ ఆయన ఇతర పార్టీలకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. గత 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.

click me!