
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెంట ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్.రమణ టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
అనంతరం ఎల్.రమణ, ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ... వివిధ అంశాలు తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని కేసీఆర్ తనతో అన్నారని.. అలాగే టీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే తాను అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రమణ వెల్లడించారు.
Also Read:కేసీఆర్ ను కలిసిన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ: త్వరలో టీఆర్ఎస్ లోకి జంప్
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఎల్.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానమన్నారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ టీఆర్ఎస్ అవసరమని అభిప్రాయపడ్డారు. రమణను టీఆర్ఎస్‌లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని... దీనికి రమణ సానుకూలంగా స్పందించారని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణలో టీడీపీ నిలబడే పరిస్థితి లేదు అని మంత్రి జోస్యం చెప్పారు. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం.