పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండో దశకు పర్యావరణ అనుమతులు ఇవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వం తీరును కేటీఆర్ తప్పు బట్టారు.
హైదరాబాద్:పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు రెండో దశకు కేంద్రం అనుమతివ్వకపోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి గురువారంనాడు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పలుమార్లు ప్రశ్నించారని కేటీఆర్ ఆ లేఖలో గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ ప్రగతిని, పురోగతిని సహించలేక కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తుందన్నారు.తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణంగా ఆయన పేర్కొన్నారు. 12.03 లక్షల ఎకరాలకు సాగునీటిని, తాగునీటికి భరోసా అందించే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతో కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుందని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో తల్లడిల్లేవన్నారు. తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్ నగర్ జిల్లా వలసల పాలైన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ తో నల్లగొండ ఫ్లోరైడ్ రాక్షసభూతాన్ని తమ ప్రభుత్వం తరిమికొట్టిందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సృష్టిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
పాలమూరుకు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేంద్రం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొండిచేయి చూపించడం కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.
ఒకవైపు కృష్ణ జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య పూరిత, వివక్షపూరిత వైఖరి దురదృష్టకరంగా కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడంలో తాము విజయం సాధించామన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రగతిని అడ్డుకునే ఎలాంటి శక్తులనైనా రాజీ పడకుండా ఎదుర్కొంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ విషయంలో కేంద్ర వివక్ష విధానాలను ప్రజలంతా ఖండించాలని కేటీఆర్ కోరారు.