TS News: పార్టీ ఓటమికి నేనే బాధ్యుడ్ని: కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ

By Mahesh K  |  First Published Jan 12, 2024, 5:05 PM IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి తానే బాధ్యుడినని కేటీఆర్ అన్నారు. తాను కార్యకర్తలను పట్టించుకోవడంలో విఫలం అయినట్టు వివరించారు. దళిత బంధు, రైతు బంధు పథకాలతో కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. బీజేపీతో గతంలో పొత్తు లేదని, భవిష్యత్‌లోనూ ఉండబోదని స్పష్టం చేశారు.
 


KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నది. కింది స్థాయి కార్యకర్తలతోనూ సమావేశం అవుతున్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ రోజు తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తానే బాధ్యుడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను పట్టించుకోలేకపోయానని కామెంట్ చేశారు. అందరినీ సమన్వయం చేయడంలో విఫలం అయ్యానని పేర్కొన్నారు. అంతేకాదు, దళిత బంధు స్కీం బెడిసికొట్టిందని వివరించారు. దళిత బంధు స్కీం కొందరికే ఇవ్వడంతో మిగిలిన వారు తీవ్ర అసహనానికి లోనయ్యారని తెలిపారు. వారు ఓపిక పట్టలేకపోయారని కామెంట్ చేశారు. అలాగే.. రైతు బంధు పథకం కూడా కొంత మేరకు వ్యతిరేకతకు కారణమైందని వివరించారు. భూస్వాములకూ రైతు బంధు ఇవ్వడాన్ని సామాన్య రైతులు అంగీకరించలేదని కేటీఆర్ అన్నారు.

Latest Videos

Also Read: TPCC: టీపీసీసీ చీఫ్ బాధ్యతలు బీసీ నేతకు? రేవంత్ రెడ్డి తర్వాత అధ్యక్షుడు ఆయనేనా?

బీజేపీతో పొత్తుపైనా..

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, చాలా చోట్ల స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారని కేటీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంలో పని చేయాలని పిలుపు ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తుపైనా క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో గతంలో పొత్తు లేదని, భవిష్యత్‌లోనూ ఉండబోదని స్పష్టం చేశారు. అలాగే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని,  పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందని వివరించారు. పార్టీలో క్రమ శిక్షణ రాహిత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

click me!