
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం (జూలై 24) రోజున 46వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కేటీఆర్ బర్తేడే వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపత్యంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల పలు జిల్లాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారికి టీఆర్ఎస్ శ్రేణులు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద తోచిన సాయం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తన జన్మదిన వేడుకలకు బదులుగా.. స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
అయితే ఇప్పటికే కేటీఆర్ పుట్టినరోజున.. రాష్ట్రవ్యాప్తంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు, చీరలు, పండ్లు, అన్నదానం చేసేందుకు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు, యువతకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కేటీఆర్ పేరుమీద 116 ఆలయాల్లో అర్చనలు చేయిస్తామని, త్రీడీ గ్రాఫిక్స్ తో స్పెషల్ కేక్, కేటీఆర్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తామని సాయి కిరణ్ యాదవ్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ద లీడర్ ఫ్రం ద లోకల్ టు గ్లోబల్ పేరిట డాక్యుమెంటరీ విడుదల ఉంటుందన్నారు. కేటీఆర్ ప్రస్థానం యావత్తు ఈ డాక్యుమెంటరీ చిత్రంలో చూడొచ్చని పేర్కొన్నారు. ఇక కేక్ లో గత ఎనిమిదేళ్లలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ‘రైజ్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో చూడవచ్చని చెప్పారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మరోమారు భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు.