
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత, తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటి రామారావు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధవళేశ్వరంపై జనసేన కవాతు విజయవంతం కావడంపై కేటీఆర్ స్పందిస్తూ పవన్ కల్యాణ్ ను అభినందించారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ పవన్ కల్యాణ్ ను అభినందించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలావుంటే, తెలంగాణ ఉద్యమంలో 2006 నుంచి 2014 వరకు ఎనిమిదేళ్లపాటు తాను ప్రజల పక్షాన పోరాడానని, అప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారని కేటీఆర్ అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణచివేయడంలో మునిగిపోయారని విమర్శించారు.
తానేదో నేరుగా వచ్చి 2014లో మంత్రి అయినట్టుగా కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అరెస్టయిన ఫొటోలను ఆన మంగళవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. తన ఉద్యమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నానని అన్నారు.