
నిజామాబాద్: బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపివేస్తారని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో KTR ప్రసంగించారు.కేంద్రంలో BJP కి ఓటేసి తప్పు చేశామన్నారు. Telanganaకు ఇచ్చిన హామీలనుNarendra Modi అమలు చేయలేదన్నారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన బీజేపీకి తెలంగాణలో పుట్టగతులుండవన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష ఎందుకని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తెలంగాణపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.. ఉపాధి హామీకి 25 శాతం నిధులు కేంద్రం తగ్గించిందన్నారు.జివితాలు మార్చమంటే జీవిత భీమాను అమ్మేశారని కేటీఆర్ సెటైర్లు వేశారు.కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ముందా అని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా తెలంగాణలో ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు.యూపీకే ప్రధానిగా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు.
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 46 వేల చెరువులకు జీవం పోశామని కేటీఆర్ చెప్పారు. గోదావరి జలాలను ఒడిసి పట్టి జిల్లాలను సస్యశ్యామలం చేశామని ఆయన గుర్తు చేశారు. గతంలో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ ఇస్తే ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రూ. 300 కోట్లతో రోడ్లను అభివృద్ది చేశామన్నారు. ప్రతి మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు.
దేశంలో 157 వైద్య కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ధర్మం కోసమని మాట్లాడుతారు, కానీ దేశం కోసం ఏం చేశారో కూడా చెప్పరని ఆయన బీజేపీ తీరును ఎండగట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్దం కొనసాగుతుంది. రెండు పార్టీలు అవకాశం దొరికితే పరస్పరం విమర్శలు గుప్పించుకొంటున్నారు. రాష్ట్రానికే కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. కేంద్రం ప్రజల కోసం ఏం చేసిందని కూడా ప్రశ్నిస్తోంది. ఏడేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని చెప్పేందుకు తాము సిద్దమని కూడా బీజేపీ నేతలు ప్రకటించారు.
బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటుకుకేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ విషయమై ఇతర రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ మంతనాలు చేస్తున్నారు. పార్టీలతో కూడా చర్చిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ ప్రయత్నాలపై బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఏమైందని కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.