
తెలంగాణ మంత్రి, సిఎం తనయుడు కెటిఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. తన కొడుకు విషయంలో ఆయన ఆవేదన చెందారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ కొన్నిసార్లు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం పట్ల కెటిఆర్ నొచ్చుకున్నారు. తన మీద ఎన్ని విమర్శలు చేసినా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రిసీవ్ చేసుకుంటానన్నారు. కానీ తన కొడుకు మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తే బాధపడ్డానని ఆవేదన చెందారు కెటిఆర్.
అభం శుభం తెలియని తన కొడుకు గురించి వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే అసలు రాజకీయాల్లో ఎందుకున్నామా అన్న బాధ కలుగుతుందన్నారు. తన కుమారుడి గురించి వ్యక్తిగతంగా కొందరు ధూషణలు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
నిజానికి టిడిపి నేతలు కెటిఆర్ కొడుకు హిమాన్ష్ ను పదే పదే రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో హిమాన్ష్ పేరు తీసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిమాన్ష్ ను సినిమాలో ఏదో ఆర్టిస్టు చిట్టి నాయుడుతో పోలుస్తూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. హిమాన్ష్ పై విమర్శలు గుప్పించిన వారిలో టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలుగు యువత నేత నన్నూరి నర్సిరెడ్డి ఎక్కవగా ఉన్నారు. వీరిద్దరూ అనేకసార్లు కామెంట్లు చేశారు.
సిఎం కెసిఆర్ కు అత్యంత ఇష్టమైన మనవడు కావడంతో వీరు హిమాన్ష్ ను కూడా వివాదం చేశారు. నీ మనవడు చదివే పాఠశాలలోనే డ్రగ్స్ విక్రయిస్తున్నారు జాగ్రత్త అంటూ ఇటీవల రేవంత్ విమర్శించారు. గతంలో నీ మనవడు హిమాన్ష్ తో పందులు కొని కాపించాలి అంటూ కూడా రేవంత్ పరుశంగా మాట్లాడారు.
నల్లగొండ జిల్లాలో హాస్టల్ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో కొందరు కాంగ్రెస్ నేతలు సిఎం మనవడు తినే అన్నం, హాస్టల్ పిల్లలు తినే అన్నం ఒకటే కదా? అలాంటప్పుడు హిమాన్ష్ ఏ ఆసుపత్రిలో ఉన్నాడంటూ కామెంట్లు చేశారు.
ఈ నేపథ్యంలో నిన్న సచివాలయంలో మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కెటిఆర్ మాటల సందర్భంలో చిన్నబుచ్చుకున్నారు.
ఏది ఏమైనా రాజకీయాలతో సంబంధం లేని చిన్నారులను వివాదాల్లోకి లాగడం మంచి రాజకీయం అనిపించుకోదు అని పొలిటీషియన్లు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని జనాలు సూచిస్తున్నారు.