
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటుకు గురయిన ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేటీఆర్.. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గౌతమ్ రెడ్డితో తనకు 12 ఏళ్ల పరిచయం ఉందన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి అకాల మరణం షాక్‌కు గురిచేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు.
ఉదయం గౌతమ్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న కేటీఆర్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ప్రియమైన మిత్రుడి ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. నమ్మలేని విధంగా షాక్ అయ్యాను ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా త్వరగా వెళ్లిపోయారు అన్న.. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇక, గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నిర్మాతలు సురేష్ బాబు, నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించడానికి పలువురు ప్రముఖులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
కొద్దిసేపటి కిత్రం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని.. అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.