
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో పర్యటించనున్నారు. మెతుకు సీమకు గోదావరి జలాలు అందించే అత్యున్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో రూ.4,427 కోట్లతో నిర్మించదలిచిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 3 లక్షల 90వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఈ రెండు లిప్ట్ ఇరిగేషన్ పథకాలకు ఏడాది పొడువున నీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీలు కేటాయించారు. ఈ మేరకు కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తో సింగూర్ రిజర్వాయర్ ను అనుసంధానించనున్నారు. అలాగే.. సంగమేశ్వర ద్వారా 12 టీఎంసీల నీటిని లిప్ట్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షలకు, ఆంథోల్ , నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈ ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో.. ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అధికారులు చేసిన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు స్వయంగా పరిశీలించారు. సీఎంఓ సమాచారం ప్రకారం... మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలి క్యాప్టర్ ద్వారా జుజాల్‌పూర్ వద్ద అనురాధ కాలేజీ ప్రాంగణం సభ స్థలానికి చేరుకోనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల శంకుస్థాపన తరువాత.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు 1.30 లక్షల మంది రానున్నట్టు తెలుస్తుంది. సీఎం రాకతో భారీగా జన సమీకరణ లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారు. మహారాష్ట్ర పర్యటన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో సీఎం ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
భారీ బందోబస్తు..
సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లా పోలీసు యంత్రాంగం. ఈ పర్యటన బందోబస్తులో 14 మంది డీఎస్పీలు, 48 సీఐలు, 80 మంది ఎస్ఐలు సహా 1500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. సీఎం బహిరంగ సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ రమణకుమార్ లు పరిశీలించారు.
మహారాష్ట్ర పర్యటన
ఆదివారం.. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముంబైలో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, బీజేపీ సర్కారుని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, సినీ నటులు ప్రకాష్ రాజ్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు