40 ఏళ్లుగా ఉంటున్నా, ఈ పరిస్థితి చూడలేదు: హైదరాబాద్ వరదలపై కేటీఆర్

By telugu teamFirst Published Oct 19, 2020, 2:44 PM IST
Highlights

తాను గత 40 ఏళ్లుగా హైదరాబాదులో ఉంటున్నానని, గతంలో ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో ఇది రెండో అతి పెద్ద వర్షమని ఆయన చెప్పారు.

హైదరాబాద్:  గత 40 ఏళ్లుగా తాను హైదరాబాదులో ఉంటున్నానని, ఇటువంటి పరిస్థితి చూడలేదని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. హైదరాబాదు వరదలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు హైదరాబాదులో ఇది రెండో అతి పెద్ద వర్షమని ఆయన అన్నారు. మూసీకి 1908లో వరదలు వచ్చాయని, అప్పట్లో ఒక రోజులోనే 43 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని ఆయన చెప్పారు 

హైదరాబాదులో సగటున 78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, ఈ ఏడాది ఇప్పటికే 80 శాతం అధికంగా వర్షపాతం రికార్డయిందని, ఇప్పటి వరకు 120 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు. ఇది వందేళ్లకోసారి సంభవించిన అసాధారణ పరిస్థితి అని ఆయన చెప్పారు.

Also Read: మరో మూడు రోజులు వర్షాలు: హైదరాబాద్ వరదలపై కేటీఆర్

చాలా వరకు ప్రాణనష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. సహాయక చర్యల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. విద్యుత్తు పునరుద్ధరణ చేపట్టామని, 1920 ట్రాన్స్ ఫారాల మరమ్మతులు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు 80 మంది ఆఫీసర్లను ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేశామని చెప్పారు.

జిహెచ్ఎంసీ కార్యాలయంలో కేటీఆర్ వరద పరిస్థితులను సమీక్షించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. ముంపు ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి కమ్యూనిటీ హాళ్లను, ఫంక్షన్ హాళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Also Read: హైదరాబాదులో మళ్లీ దంచికొడుతున్న వాన: పెద్ద చెరువుకు ప్రమాదం

click me!