
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సారథ్యంలోని బృందం అమెరికాలోని ఫార్మా దిగ్గజాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడి ప్రభుత్వ ప్రతినిధులతోపాటు నేరుగా ఫార్మా దిగ్గజ సారథులతోనూ భేటీ అవుతున్నారు. తాజాగా, ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీలు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే సారథులతో శుక్రవారం సమావేశం అయ్యారు. తెలంగాణలోని అధునాతన సదుపాయాలు, సౌకర్యాలు, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి దోహదపడే అంశాల గురించి వివరించారు.
హైదరాబాద్‌లోని లైఫ్ సైన్స్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేయడానికి మంత్రి కేటీఆర్ అమెరికాలో మూడు దిగ్గజ ఫార్మా కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు. ఫైజర్ సీఈవో, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఈ కంపెనీకి చెందిన ప్రముఖులు, అలాగే, గ్లాక్సో స్మిత్ క్లైన్(జీఎస్కే) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌లతో మంత్రి కేటీఆర్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పలు కలిశారు.
ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే కంపెనీలు యేటా 170 బిలియన్ డాలర్ రాబడి గల దిగ్గజ కంపెనీలు. సుమారు 3.03 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ మూడు ఫార్చూన్ 500 జాబితాలో ఉన్నవే.
ఫైజర్ సీఈవో, చైర్మన్ డాక్టర్ అల్బర్ట్ బౌర్లా, ఈవీపీ, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్ డెర్మాట్‌లతో మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ స్థితిగతులను, వేగంగా వృద్ధి చెందుతున్న తీరును వివరించారు. అలాగే, భారత్‌లో హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ సెక్టార్‌లో ఫైజర్ వ్యూహాలను, ప్రణాళికలను అర్థం చేసుకున్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మాస్యూటికల్, ఆర్ అండ్ డీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మత్తయి మామ్మెన్‌ను కలిశారు. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండే లైఫ్ సైన్సెస్ కంపెనీ. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్‌పై జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు.
గ్లాక్సో స్మిత్ క్లైన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిస్టర్ ఆగమ్ ఉపాద్యాయ్‌ను కలిశారు. ఆయనతో జరిగిన సమావేశంలో తెలంగాణ రాజధానిలోని టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను వెల్లడించారు.
ఈ కంపెనీల సారథులు మంత్రి కేటీఆర్ వివరణలపై ప్రశంసలు కురిపించారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనా వారు ఆసక్తి కనబరిచారు. ఈ కంపెనీలతో కలిసి హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగంలో తేవాలనుకుంటున్న మార్పులను మంత్రి కేటీఆర్ వివరించారు. వారి నుంచి సలహాలు, సూచనలను కోరారు. అలాగే, హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్‌ను మరింత ముందుకు పోవడానికి సహకరించాలని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సి ఉన్న 20వ బయో ఏషియా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించారు.