విద్యార్థిని తండ్రిని కాలితో తన్నిన పోలీస్.. నెటిజన్ ట్వీట్ కి కేటీఆర్ రియాక్షన్ ఇదే

By telugu news teamFirst Published Feb 27, 2020, 11:32 AM IST
Highlights

ఇంటి నుంచి చక్కగా కాలేజీకి వెళ్లిన కూతురు ఉన్నపళంగా శవంగా మారడం చూసి ఆమె తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురు శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మంత్రిగా తన బాధ్యతలు చక్కపెడుతూనే.. సోషల్ మీడియాలోనూ ప్రజల సమస్యలను ఆయన నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా మంది సమస్యలను ఆయన ట్విట్టర్ వేదికగా తెలుసుకొని పరిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా... ఓ నెటిజన్ చేసిన ఓ ట్వీట్ కి కూడా కేటీఆర్ స్పందించారు. ఆయన స్పందించిన తీరు ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. 

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల హైదరాబాద్ లోని పటాన్ చెరువులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే... ఆమె మరణవార్త తెలుసుకొని  విద్యార్థిని తండ్రి కాలేజీకి చేరుకున్నాడు. 

ఇంటి నుంచి చక్కగా కాలేజీకి వెళ్లిన కూతురు ఉన్నపళంగా శవంగా మారడం చూసి ఆమె తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురు శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. 

కూతురు మరణించి ఏడుస్తున్న తండ్రిని కాలితో తంతూ పోలీస్ దాష్టీకం (వీడియో..

అయితే... కూతురు చనిపోయి బాధలో ఉన్న ఆ తండ్రి పట్ల ఓ పోలీసు అతి కిరాతకంగా ప్రవర్తించాడు. బాధలో ఉన్నవారి పట్ల సానుభూతి ప్రకటించాల్సింది పోయి దాష్టీకం చూపించాడు.  విద్యార్థిని తండ్రిని కాలితో తన్నాడు. ఆ తండ్రి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియో చూసినవారంతా ఆ పోలీసుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా... తాజాగా ఓ నెటిజన్ ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్టు చేసి కేటీఆర్, తెలంగాణ పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఆ నెటిజన్ ట్వీట్ కి మంత్రి కేటీఆర్ స్పందించారు.

పోలీసుల తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ పోలీసుల తీరును హోం మంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్తానని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. కష్టకాలంలో ఉన్న బాధితుల పట్ల.. ఏ ప్రభుత్వ అధికారులైనా సానుభూతి ప్రదర్శించాలని.. ఎవరైనా కూడా అదే కోరుకుంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.  ఆ పోలీసులపై సత్వరంగా చర్యలు తీసుకోవాలని , బాధితులకు పరిష్కారం కూడా చూపించాలంటూ నెటిజన్లు కోరుతుండటం విశేషం. 

click me!