ఇండియన్ రేసింగ్ లీగ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. హుస్సేన్‌సాగర్ తీరంలో రేసింగ్ కార్ల పరుగులు..

By Sumanth KanukulaFirst Published Nov 19, 2022, 6:02 PM IST
Highlights

హైదరాబాదులోని హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసును ప్రారంభించారు.

హైదరాబాదులోని హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసును ప్రారంభించారు. హుస్సేన్‌ సాగర్‌ తీరాన నూతనంగా రూపొందించిన స్ట్రీట్‌ సర్క్యూట్‌పై స్పోర్ట్స్ కార్లు రయ్.. రయ్.. మంటూ పరుగులు తీశాయి. రేసింగ్‌కు ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు, రేపు ఈ లీగ్ జరగనుండగా.. కొద్దిసేపటి క్రితం తొలి రోజు రేసింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీనిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలించారు. నిర్వాహకులు కూడా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అభిమానులతో కలిసి రేసింగ్‌ను వీక్షించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హీరో నిఖిల్, కేటీఆర్ తనయుడు హిమాన్షు కూడా రేసింగ్ పోటీలను వీక్షించారు. మధ్యాహ్నం 3.10 గంటల నుంచి 3.20 గంటల వరకు తొలి క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.40 గంటల వరకు రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ నిర్వహించారు. క్వాలిఫైయింగ్ 1, 2 రౌండ్ల తర్వాత.. మెరుగైన టైమింగ్ సాధించిన అర్హులతో సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు మెయిన్ రేస్ నిర్వహించారు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా-ఈ రేసు ప్రిపరేషన్‌లో భాగంగా ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు పెట్రోల్ కార్లతోనే ఈ రేస్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ సహా మొత్తం ఆరు జట్లు ఈ రేసులో తలపడ్డాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడ్డారు. 50 శాతం దేశీయ రేసర్లు, మరో 50 శాతం విదేశీ రేసర్లు.. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో పాల్గొన్నారు. 

చ్చే ఏడాది ఫార్ములా ఈ రేసుల కోసం ఉపయోగించబడే ట్రాక్‌లలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ట్రయల్ రేస్‌లు భవిష్యత్ రేసుల కోసం ట్రాక్‌ల సంసిద్ధతకు సహాయపడతాయని స్పష్టం చేశారు.

ఇక, ఇండియన్ రేసింగ్ లీగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్ వైపు రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొన‌సాగ‌నున్నాయి. వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రేస్‌లు నెక్లెస్‌ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్‌, ఓల్డ్ సెక్ర‌టేరియ‌ట్‌ నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్, మింట్‌ కంపౌండ్ మీదుగా ఐమాక్స్‌ వరకు కొన‌సాగుతాయి.

click me!