
తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్‌పై (trs) కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్ (ktr) . ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన డబ్బుతో బీజేపీ రాష్ట్రాలు బతుకుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ అప్పులు చేస్తూ మమ్మల్ని నిందిస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. మోడీ ప్రధానిగా (narendra modi) బాధ్యతలు చేపట్టాక లక్ష కోట్ల అప్పు అదనంగా చేశారని.. 2014లో దేశం అప్పు 56 లక్షల కోట్లని ఆయన ధ్వజమెత్తారు. దద్దమ్మ ప్రధాని ఉంటే ఇలానే జరుగుతుందని.. కర్ణాటకలో బీజేపీ చేసే అవినీతి దారుణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కార్పోరేట్ బాబులకు అప్పులు మాఫీ చేస్తారని ఫైరయ్యారు.
మా స్టీరింగ్ ఓవైసీల చేతుల్లో లేదని.. మా చేతుల్లోనే వుందని, మీ స్టీరింగే కార్పోరేట్ల చేతుల్లో వుందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోమని.. 8 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని అడిగామని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో 119 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే.. 108 సీట్లలో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యానని మంత్రి గుర్తుచేశారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల కాళ్లకు దండం పెట్టాలని.. అమిత్ షా తుక్కుగూడలో తుప్పు డిక్లరేషన్ ప్రకటించారని కేటీఆర్ సెటైర్లు వేశారు.
హమ్ దో హమారా దో అనుకుంటూ గుజరాతీయులు దేశాన్ని దోపిడీ చేస్తున్నారంటూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే ఏడున్నర లక్షల ఖాళీలు వున్నాయని.. ఇక్కడేం జరుగుతోందో తెలియకుండా రాసిన స్క్రిప్ట్ చదవి పోతున్నారని కేటీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రం అప్పల పాలైందని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం జాతీయ హోదా ఎందుకు ఇవ్వదని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం కేంద్రానికి రూ.3,65,797 కోట్లు పన్నులు చెల్లించిందని.. కానీ కేంద్రం తెలంగాణకు తిరిగి ఇచ్చింది రూ.1,68,000 కోట్లేనని మంత్రి తెలిపారు.
గుజరాత్‌లో ఆడబిడ్డలు బిందెలు పట్టుకెళ్లి గుంతల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారని.. కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆయన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ అసమర్థ ప్రభుత్వం వల్ల ఆకలి సూచికలో ఇండియా 116వ స్థానంలో వుందని ఎద్దేవా చేశారు. రైతు బంధును చూసి కేంద్రం పీఎం కిసాన్ పథకం పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అంబానీ, అదానీల కోసం మోడీ, అమిత్ షాలు పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత గుజరాత్, ఎంపీ, యూపీ, హర్యానాలలో వారాంతపు కరెంట్ కోతలు అమలవుతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు.
గుజరాత్‌లో మూడుసార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గడిచిన ఆరు నెలల్లో గుజరాత్‌లో ఐదుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం పదవి కావాలంటే రూ.2,500 కోట్లు ఇవ్వాలంటూ బీజేపీ అధిష్టానం తనను అడిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యే చెప్పారని ఆయన దుయ్యబట్టారు. ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోలేదని.. పార్టీ నుంచి కూడా ఎవరూ ఖండించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కర్ణాటకలో 30 శాతం కమీషన్ ఇవ్వనిదే ఎండోమెంట్ నిధులు కూడా రావని... 40 శాతం కమీషన్లు ఇస్తే తప్ప బిల్లులు రావని కాంట్రాక్టార్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు వచ్చి అన్ని అబద్ధాలు మాట్లాడారని.. ఆయన అమిత్ షా కాదని, అబద్ధాల షా అని కేటీఆర్ ధ్వజమెత్తారు.