కృష్ణా నదీ జలాల వివాదం: వైఎస్ జగన్ తో భేటీకి కేసీఆర్ 'నో'

By telugu teamFirst Published Jun 26, 2021, 8:37 AM IST
Highlights

కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చర్చలకు తెలంగాణ సీఎం కెసీఆర్ సిద్ధంగా లేరని సమాచారం. తమ సీఎం జగన్ కేసీఆర్ తో చర్చలకు సిద్ఘంగా ఉన్నారని ఏపీ మంత్రులు చెబుతున్నారు.

హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికిప్పుడు భేటీకి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇష్టంగా లేరని సమాచారం. ఇరువురు ముఖ్యమంత్రులు చివరిసారి 2020 జనవరిలో కలిశారు. 

కృష్ణా జలాల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కేసీఆర్ తో చర్చలకు తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి పేర్ని నాని చెప్పారు. ఏపీ మంత్రులు ఇదే విషయం చెబుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడే అందుకు కేసీఆర్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 

కృష్ణా నదీ జలాల వాడకంపై సందేహాలను తీర్చడానికి తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని, అందుకు కేసీఆర్ తో చర్చలు జరపడానికి కూడా సిద్ధంగానే ఉన్నారని పేర్ని నాని చెప్పారు. రాజకీయాల కోసం తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు వివాదం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. 

కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టులను, ఆర్డీఎస్ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటేనే ఏపీ ప్రభుత్వంతో చర్చలకు కేసీఆర్ సిద్ధపడనున్నట్లు తెలుస్తోంది. అంతవరకు జగన్ తో చర్చలు జరిపేది లేదనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. గోదావరి జలాలను పంచుకోవడానికి కేసీఆర్ ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. గోదావరి మిగుల జలాల వాడకం కోసం ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఉమ్మడిగా గానీ వ్యక్తిగతంగా గానీ ప్రాజెక్టులు కట్టుకోవడానికి వీలుగా చర్చలు ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు.  ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వారిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు చెబుతున్నారు. పనుల స్థితిగతులను అంచనా వేయడానికి కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్ఎంబీ) బృందాన్ని రాయలసీమ ఎత్తపోతల ప్రాజెక్టు ప్రాంతానికి పంపిస్తానని గజేంద్ర షెకావత్ కేసీఆర్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

click me!