టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి: గులాబీ కండువా కప్పిన కేసీఆర్

By Siva KodatiFirst Published Jul 21, 2021, 5:27 PM IST
Highlights

హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి.. బుధవారం టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు
 

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం కౌశిక్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2001లో గులాబీ జెండా ఎగురవేసినప్పుడు కౌశిక్ రెడ్డి తండ్రి తనతో కలిసి పనిచేశారని కేసీఆర్ తెలిపారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి పతాక స్థాయికి తీసుకెళ్లారని సీఎం గుర్తుచేశారు.

నాడు తెలంగాణలోని 14 ఎంపీ స్థానాలకు గాను 11 మంది ఎంపీలను గెలిపించారని తెలిపారు. అయితే నాటి కర్కశ కేంద్ర పాలకులు ప్రజా అభిప్రాయాన్ని గౌరవించకపోవడంతో తెలంగాణ రాలేదని కేసీఆర్ గుర్తుచేశారు. ఉద్యమం సమయంలో ఎన్నో అనుభవాలను దిగమింగుకుంటూ గడిపామన్నారు. పిడికిలి మందితోనే ఆనాడు ఉద్యమం చేశానని, ఈ క్రమంలో ఎగతాళి చేసినవారు, అవమానించినవారు వున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రోఫెసర్ జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపామని సీఎం వెల్లడించారు. 

ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడటం, గెలవడం నిరంతర ప్రక్రియ అని కేసీఆర్ అన్నారు. శాశ్వతంగా ఎవరూ అధికారంలో వుండరని, ఇది రాచరిక వ్యవస్థ కాదని కేసీఆర్ తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ అయ్యిందని.. తెలంగాణ ప్రభుత్వ ఫలితాలు కళ్లముందున్నాయని సీఎం గుర్తుచేశారు. రైతు బంధుపై కొందరు విమర్శలు చేస్తున్నారని.. తెలంగాణలో ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు. 

click me!