నీది నాదీ ఒకే కథ.. అమృతకు కౌసల్య ఓదార్పు

By ramya neerukondaFirst Published Sep 21, 2018, 4:09 PM IST
Highlights

 దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో.. కట్టుకున్న భర్తను ఆమె కళ్లెదుటే తండ్రి తరఫువాళ్లు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో వాదోపవాదాలు మద్రాసు హైకోర్టులో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 

మిర్యాలగూడ పరువు హత్య.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. కూతురు తక్కువ కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్ ని దారుణంగా పట్టపగలే హత్య చేయించాడు. ఈ షాక్ నుంచి తేరుకోవడానికి అమృతకు చాలా కాలం పట్టేలా ఉంది.

ఎంత మంది బంధువులు, కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులు ఆమెను ఓదార్చినా.. తీరే బాధకాదు అది. ఆ బాధ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి సమయంలో అమృతను ఓదార్చి.. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు కౌసల్య శంకర్. తమిళనాట 2016లో సంచలనం సృష్టించిన పరువు హత్యలో ఆమె బాధితురాలు. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో.. కట్టుకున్న భర్తను ఆమె కళ్లెదుటే తండ్రి తరఫువాళ్లు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో వాదోపవాదాలు మద్రాసు హైకోర్టులో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి కౌసల్య కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.
 
సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యతో మరోసారి కౌసల్య - శంకర్‌ల ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మిర్యాలగూడకు చేరుకున్న కౌలస్య.. అమృతను పరామర్శించారు. ప్రణయ్ హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అమృతను ఓదార్చి ధైర్యం చెప్పిన కౌసల్య.. తన భర్త హత్యకు సంబంధించిన వీడియోను అమృతకు చూపించారు. 

ఈ సందర్భంగా కేసులో ఎంతమందికి శిక్ష పడింది అని అమృత అడగగా.. కేసు తుదితీర్పు ఇంకా వెలువడలేదని కౌసల్య తెలిపారు. నిందితులు ఇప్పటి వరకు 58 సార్లు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని.. వాటిని మద్రాస్ హౌకోర్టు తిరస్కరిస్తూనే ఉందని చెప్పారు. శంకర్ హత్యకు కారణమేంటని అమృత ప్రశ్నించగా.. కులమేనని తెలిపారు. ప్రణయ్ హత్యలో నిందితులకు బెయిల్ రాకూడదని బలంగా కోరుకుంటున్నానని.. వాళ్లు బయటకు వస్తే.. తనకు పుట్టబోయే బిడ్డకు కూడా హాని చేస్తారని ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేసింది అమృత.

ఇవి కూడా చదవండి

ప్రణయ్ లాగే శంకర్ ది కూడా పరువు హత్యే...

click me!
Last Updated Sep 22, 2018, 8:47 AM IST
click me!