Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే హాల్ట్ స్టేషన్ మంజూరు చేసింది.
Komuravelli Railway Station: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ ఆలయ దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే హాల్టింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ కోసం కేంద్రానికి అనేక సార్లు లేఖలు రాశామనీ, ఈ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తు కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతి ఇచ్చిందని అన్నారు. త్వరలో కొమురవెల్లి స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని, కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణం పనులు వేగంగా చేపడుతామన్నారు. లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
నేటీ నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో నేటీ నుంచి వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామివారి కల్యాణం, పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహిస్తారు. భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్నం వారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దీక్షలను విరమిస్తారు. ఈనెల 22న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహిస్తాయి.