
హైదరాబాద్: తమ కుటుంబంపై తెలంగాణ పిసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డిని విమర్శించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తనను కూడా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యం చేశారని వెంకట్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, రేవంత్ రెడ్డి నుంచి ఏ విధమైన స్పందన కూడా రాలేదు. వెంకట్ రెడ్డి డిమాండుపై ఆయన మౌనం వహించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అనుసరించిన వైఖరిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని అధిష్టానం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిపై వరుసగా అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రేవంత్ రెడ్డి తీరుపై సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి, పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని అధిష్టానం రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ముందు అలాంటి వ్యాఖ్యం చేయవద్దని, సీనియర్లను కలుపుకుని మునుగోడు ఎన్నికపై ద్రుష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, తన డిమాండుపై రేవంత్ రెడ్డి స్పందించకపోవడం పట్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ స్పందించకపోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తనను కలవడానికి ఢిల్లీ వచ్చిన కొంత మంది కాంగ్రెస్ పెద్దల వద్ద తన ఆవేదనను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గత మూడు దశాబ్దాలుగా తాను నిబద్ధతతో పనిచేశానని, అటువంటి తనను, తన కుటుంబాన్ని అవమానరిచే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, అయినప్పటికీ మాణిక్యం ఠాగూర్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉంటూ వస్తోందని, సీనియర్లను అసలు లెక్కచేయడం లేదని, ఒంటెత్తు పోకడలు పోతున్నారని, పార్టీలో గ్రూపులు కడుతున్నారని వెంకట్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఆయన అన్నటు్ల తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
కాగా, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లో నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి తనపై ఉన్న చంద్రబాబు ముద్రను అంత సులభంగా తుడిచిపెట్టుకుని పరిస్థితులు కనిపించడం లేదు. తాను టిడిపి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తీరు కూడా ఇప్పుడు విమర్శలకు తావు కల్పిస్తోంది.