కోమటిరెడ్డి బ్రదర్స్ ఎఫెక్ట్: కాంగ్రెస్ లోకి తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్

By Pratap Reddy KasulaFirst Published Aug 5, 2022, 8:11 AM IST
Highlights

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తన పార్టీని కూడా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో విలీనం చేస్తారు.

హైదరాబాద్: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే దారి పట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం ఉదయం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున బరిలోకి దిగనున్నారు. దీంతో మునుగోడు నుంచి చెరుకు సుధాకర్ ను పోటీకి దింపాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. చెరుకు సుధాకర్ కు గురువారం ఉదయం కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఎఐసిసి పెద్దలతో దాదాపు నాలుగు గంటల పాటు చెరుకు సుధాకర్ చేరికపై చర్చలు జరిగాయి. అధిష్టానం నుంచి లైన్ క్లియర్ కావడంతో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

అదే సమయంలో చెరుకు సుధాకర్ తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. చెరుకు సుధాకర్ 1961 ఆగస్టు 31వ తేదీన నల్లగొండ జిల్లా గుండ్రంపల్లిలో జన్మించారు. గాంధీ మెడికల్ కళాశాల నుంచి ఎంబిబిఎస్ డిగ్రీ తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1997 నుంచి పోరాటం చేస్తూ వచ్చారు. మలిదశ ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపు మేరకు టిఆర్ెస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ కు రాజీనామా చేసి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 


ఇదిలావుంటే, ఊహించినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంపై వారిద్దరు గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచే వారిద్దరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానిిక ఇష్టంగా లేరనే ప్రచారం జరుగుతూ వస్తోంది. వీరిద్దరు కాంగ్రెస్ కు దూరమవుతున్న నేపథ్యంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరడం వల్ల నల్లగొండ జిల్లా రాజకీయాలు మలుపు తీసుకోనున్నాయి.

click me!