ఖర్గే, సోనియా ఆదేశిస్తే మా ఎంపీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Mar 26, 2023, 12:58 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం చాలా బాధకరమని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ గొప్ప నాయకుడని చెప్పారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం చాలా బాధకరమని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ గొప్ప నాయకుడని చెప్పారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా ఈరోజు హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశం కోసం రాహుల్ గాంధీ తన తండ్రిని, నానమ్మను పొగొట్టుకున్నాడని చెప్పారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం అంతా కలిసి ఉండాలని రాహుల్ సందేశం ఇచ్చారని.. ఎక్కడ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని కోరలేదని అన్నారు. 

2004, 2009లలో రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చిన రాహుల్ పదవి కోసం ఆశపడలేదని అన్నారు. కేంద్ర మంత్రి పదవి తీసుకోమని కోరిన  తీసుకోలేదని అన్నారు. దేశం కోసం పనిచేసే మహా నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. అనర్హత వేటు వేసి రాహుల్ గాంధీ గొంతు నొక్కే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. అదానీ గురించి పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారని.. మళ్లీ మాట్లాడితే బీజేపీ బండారం బయటపెడతారనే ఆయన గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. 

శిక్ష విధించిన సెషన్ కోర్టు పైకోర్టుకు వెళ్లేందుకు 30 రోజులు సమయం ఇచ్చినా వెంటనే అనర్హత వేటు వేయడమేమిటని ప్రశ్నించారు. అదానీ ఇష్యూను డైవర్టు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాహుల్ వెంట నడుస్తామని.. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని  చెప్పారు. ఏఐసీసీ ఖర్గే, సోనియా గాంధీ ఆదేశిస్తే.. తమ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తోందని అన్నారు.  తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవడానికి.. ప్రతి పోరాటానికి అండగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులను పిలుపునిచ్చారు. 

click me!