వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు: రాజగోపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి

By telugu teamFirst Published Jun 7, 2021, 12:52 PM IST
Highlights

తన సోదరుడు, పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలోచేరుతారనే ప్రచారంపై తెలంగాణ కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పార్టీలోకి వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారని ఆయన అన్నారు.

హైదరాబాద్: తన సోదరుడు, పార్ట ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారనే వార్తలపై కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెసు పార్టీకి చావు లేదని ఆయన అన్నారు. పార్టీలోకి వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారని ఆయన అన్నారు. తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పార్టీ మార్పు ప్రచారంపై మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. 

అన్న ఓ పార్టీలో, తమ్ముడు మరో పార్టీలో ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తమది ఉమ్మడి కుటుంబమని, రాజకీయాలు తమ కుటుంబంలో చర్చకు రావని ఆయన చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. పిసీసీ పదవి ఇస్తేనే తాను తీసుకుంటాని, ఇతర పదవులేవీ తాను తీసుకోబోనని ఆయన చెప్పారు. 

వారం, పది రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని ఆయన చెప్పారు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, జగ్గారెడ్డి, వి హనుమంతరావు కూడా తెలంగాణ పీసీసీ పదవిని అడుగుతున్నారని ఆయన చెప్పారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఆయన బిజెపి నేత డికె అరుణతో సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. తాను ఎవరినీ కలువలేదని, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఆయన అన్నారు. 

click me!