భువనగిరి ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ రాజీనామా సమర్పించారు.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారంనాడు రాజీనామా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నల్గొండ శాసనసభ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో భువనగిరి ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 11న బాధ్యతలు చేపట్టారు.
సోమవారంనాడు ఉదయం ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. 2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. 1999 నుండి 2014 వరకు ఇదే అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా వరుస విజయాలు సాధించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ స్థానంలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.