కేసిఆర్ సర్కారుకు కోమటిరెడ్డి కొత్త దెబ్బ

First Published Mar 16, 2018, 3:20 PM IST
Highlights
  • స్వామిగౌడ్ ను గాయపరిచిన వీడియో పుటేజీ కావాలి
  • ఆర్టీఐ ద్వారా అసెంబ్లీ కార్యదర్శికి దరఖాస్తు పెట్టిన కోమటిరెడ్డి
  • రాజకీయవర్గాల్లో వీడియో ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ

శాసనమండలి ఛైర్మన్ కంటి దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను బాధ్యులుగా చేస్తూ వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేసింది తెలంగాణ అసెంబ్లీ. అయితే దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతున్నది. ఎవరేమనుకున్నా డోంట్ ఖేర్ అన్నట్లు తెలంగాణ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల స్థానాల్లో ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది టిఆర్ఎస్.

ఈ పరిస్థితుల్లో తమ సభ్యత్వాల రద్దుపై పోరుబాట పట్టారు కోమటిరెడ్డి, సంపత్. తాజాగా హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. కేసు విచారణ షురూ అయింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక కోమటిరెడ్డి కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. తన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నారు. చివరి ఆయుధంగా ఆర్టీఐ అస్త్రాన్ని కోమటిరెడ్డి ప్రయోగించారు. ఈనెల 12 వ తేదీన అసెంబ్లీ లో జరిగిన పరిణామాలపై అన్ని కెమెరాల్లో రికార్డయిన వీడియో పూటేజ్ లు కావాలని కోరుతూ ఆర్టీఐ చట్టం ద్వారా అసెంబ్లీ కార్యదర్శికి దరఖాస్తు పెట్టారు.

ఇప్పుటి వరకు తమకు ఎదురే లేదని భావించిన తెలంగాణ సర్కారు.. మరి ఈ ఆర్టీఐ దరఖాస్తు విషయంలో ఏరకంగా స్పందిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇన్నిరోజులుగా కోమటిరెడ్డి ఎగిరి కొట్టిన వీడియో మాత్రమే పాలకపక్షం విడుదల చేసింది. ఆ వీడియో ఆధారంగా కోమటిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు సర్కారు చెప్పుకున్నది. కానీ కాంగ్రెస్ నేతలు ఎంత అడిగినా.. కోమటిరెడ్డి కొట్టిన దెబ్బకు స్వామి గౌడ్ కంటికి గాయమైనట్లు వీడియో చూపెట్టడంలేదు. ఆ వీడియో ఉంటే ఎందుకు బయట పెట్టడంలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసిరిన చాలా సేపటికి స్వామిగౌడ్ కు గాయమైనట్లు చెప్పారని ఇదంతా కేసిఆర్ ఆడిస్తున్న నాటకం అని కాంగ్రెస్ బలంగా వాదిస్తోంది.

‘‘గవర్నర్ ప్రసంగం.. ఆ సమయంలో కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసిరారు. ఆ తర్వాత 15 నిమిషాలకు పైగా ప్రసంగం నడిచింది. తర్వాత జాతీయ గీతం పాడారు. ఆ సమయంలో అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్, సిఎం, స్పీకర్, ఛైర్మన్ అందరూ కలిసి బయటకు వచ్చే వీడియో అన్న టివిల్లో ప్రసారమైంది. తర్వాత సీన్ కట్ చేస్తే ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైందని వీల్ చైర్ లో సరోజిని కంటి ఆసుపత్రికి తరలించారు. ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అలాంటప్పుడు కోమటిరెడ్డి హెడ్ ఫోన్ దెబ్బకు ఛైర్మన్ కంటి గాయానికి సంబంధమే లేదు కదా?’’ అని కాంగ్రెస్ వాదిస్తోంది.

మరి కోమటిరెడ్డి పెట్టిన దరఖాస్తుకు అసెంబ్లీ సచివాలయం ఏరకమైన జవాబు ఇస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవేళ ఆ వీడియోలు ఇస్తారా? లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది.

click me!