రాజీనామా చేసే ప్రసక్తే లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

By Arun Kumar PFirst Published Feb 23, 2021, 10:25 AM IST
Highlights

మునుగోడును విడిచి నాగార్జునసాగర్ లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  
 

చౌటుప్పల్:  నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో బిజెపి తరపున పోటీచేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. తాను మునుగోడును విడిచి నాగార్జునసాగర్ లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అబద్దమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు గతంలోనే ప్రకటించగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  రాజగోపాల్ రెడ్డి దర్శనానంతరం మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ముందుగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతానని మరోసారి స్పష్టం చేశారు. అయితే తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ ని వీడరని క్లారిటీ ఇచ్చారు. 

బిజెపిలో చేరనున్నట్లు స్వయంగా తానే ప్రకటించిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని నాగార్జునసాగర్ బరిలో దించాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి  ఆలోచన తనకు లేదని... తాను మునుగోడు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేసి ఆ ప్రచారానికి తెరదించారు.  

 
 

click me!