నెక్ట్స్ పీసీసీ ప్రక్షాళనేనా...ఉత్తమ్‌ను తప్పిస్తారా: క్లూ ఇచ్చిన కోమటిరెడ్డి

By sivanagaprasad kodatiFirst Published Jan 19, 2019, 1:20 PM IST
Highlights

 టీపీసీసీ ప్రక్షాళన తప్పదని, ఉత్తమ్‌ను మార్చి ఆయన స్థానంలో మరోనేతకు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దీనికి బలాన్నిస్తున్నాయి. సీఎల్పీ కోసం చివరి వరకు ఉత్తమ్, భట్టిలతో పోటీలో నిలిచిన కోమటిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పలు కథనాలు వినిపిస్తున్నా.. ప్రధానంగా పార్టీలోని సీనియర్, ఇతర నేతలు పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే అందరూ వేలేత్తిచూపుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ బహిరంగంగానే ఉత్తమ్‌పై కారాలు మిరియాలు నూరారు. 

పీసీసీలో ఎందుకు పనికిరాని వాళ్లను పెట్టుకుని ఆయన్ని వ్యతిరేకించిన వారిపైకి ఉసిగొల్పుతున్నారంటూ సర్వే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ప్రస్తుతానికి తాను ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌నే అని ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్లు వస్తారని ప్రకటించడంతో టీకాంగ్రెస్‌లో పెద్ద చర్చ నడిచింది. ఈ లోపు అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ ఎంపిక విషయంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పదవిని ఆశిస్తున్న సీనియర్లకు మధ్య కోల్డ్‌వార్ నడిచింది. 

అయితే సీఎల్పీకి పోటీ పడుతున్న వారంతా ప్రధానంగా రెడ్లే కావడంతో వారికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. భట్టి విక్రమార్క దళితుడు కావడంతో దళితుడిని వ్యతిరేకించామన్న పేరు వస్తుందేమోనన్న భయంతో ‘‘రెడ్లు’’ పక్కకు తప్పుకున్నారని విశ్లేషకుల అంచనా. దళిత అస్త్రం పనిచేయడంతో అధిష్టానం కూడా కాస్తంత ఊపిరి పీల్చుకుంది.

దీంతో త్వరలో టీపీసీసీ ప్రక్షాళన తప్పదని, ఉత్తమ్‌ను మార్చి ఆయన స్థానంలో మరోనేతకు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దీనికి బలాన్నిస్తున్నాయి. సీఎల్పీ కోసం చివరి వరకు ఉత్తమ్, భట్టిలతో పోటీలో నిలిచిన కోమటిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో భట్టికి సీఎల్పీ పదవిని కట్టబెట్టడమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని రాహుల్ గాంధీకి వదిలివేశామని, ఆయన నిర్ణయానికి కట్టుబడి తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్కకి డిప్యూటీ స్పీకర్‌, విప్‌గా చేసిన అనుభవం ఉందని కాబట్టి ఆయనే ఆ పదవికి అర్హుడని వెల్లడించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నష్టం చేసిందని, చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లు ఎన్నికలు జరిగాయని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి ఒక్కరినే బాధ్యులుగా చేయటం సరికాదన్నారు. అధిష్టానం కూడా ఎన్నికలకు కొంతముందే సీట్లు ఇస్తే బాగుండేదని, సీట్ల కేటాయింపులో కూడా కొన్ని లోపాలు జరిగాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై రాహుల్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. చివర్లో పీసీసీ మార్పు అనేది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని, అది మా పరిధిలోనిది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిని బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వర్గం హైకమాండ్‌కు నివేదిక ఇచ్చిందని విశ్లేషకుల అంచనా. 

కీలకమైన సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ పూర్తికావడంతో నెక్ట్స్ పీసీసీ ప్రక్షాళనపైనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందని కథనాలు వస్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలలే గడువు ఉండటంతో పీసీసీని కదపటం మంచిదికాదనే పలువురు రాహుల్‌కు సూచించారని గాంధీభవన్‌ టాక్.

click me!