
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో (bandi sanjay) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పంతంగి వద్ద మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలో చేరిక తేదీ, బహిరంగ సభ అంశంపై చర్చించారు. ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , తదితర బీజేపీ పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 21న భారీ బహిరంగ ఏర్పాటు చేసి అమిత్ షా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే అదే రోజున పలువురు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో (komatireddy raja gopal reddy) పాటు మరికొందరు బీజేపీలో (bjp) చేరుతారని అన్నారు. జయసుధ లాంటి వారితో మాట్లాడుతున్నామని తెలిపారు. మునుగోడు ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వబోతున్నారని.. కేసీఆర్ (kcr) ఎవరినీ కలవరని, అలాంటి సీఎం మనకు అవసరమా అని రాజేందర్ ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. బీజేపీ ఆందోళన వల్ల ఆగస్ట్ 15 నుంచి పది లక్షల పెన్షన్లు ఇస్తానని ప్రకటించారని రాజేందర్ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన జోస్యం చెప్పారు.
Also Read:రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇమడడం కష్టమే.. గుత్తా సుఖేందర్ రెడ్డి
ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి సోమవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. రాజీనామా లేఖను అందజేసిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో.. మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ గురించి త్వరలోనే ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. దీంతో నిబంధనల ప్రకారం మునుగోడు శాసన సభ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వాహించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
అంతకు ముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోనని చెప్పారు. తన మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేసి తీర్పు కోరానని తెలిపారు. దైర్యం లేకపోతే తాను ఈ పని చేసేవాడిని కాదని చెప్పారు. తనపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.