
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. గెలుపు కోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజగా మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీపీ మద్దతు కోరేందుకు రాజగోపాల్ రెడ్డి.. చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆ తర్వాత అధికారికంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీడీపీ మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవానికి కోమటిరెడ్డి బ్రదర్స్.. చంద్రబాబుకు వ్యతిరేకం. వారికి మాజీ సీఎం వైఎస్సార్ సన్నిహితులనే పేరుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తును కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకించినట్టుగా చెబుతారు. అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం సూచనల మేరకు.. ఆయన చంద్రబాబును కలవనున్నారనే ప్రచారం సాగుతుంది.
ఇక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లలో గెలుపొందగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిలో చాలా మంది ఇతర పార్టీల కండువా కప్పుకున్నారు. పార్టీలోని కింది స్థాయి నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇక, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా బరిలో దిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వారు టీడీపీని వీడి అధికార టీఆర్ఎస్‌లో చేరారు.
Also Read: తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
తెలంగాణ ఏర్పాటు తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన ఎల్ రమణ్ కూడా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షునిగా బక్కని నర్సింహులు కొనసాగుతున్న.. ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఇక, టీటీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ వంటి నాయకులు ఉన్నారు. అందులో రావుల యాక్టివ్ పొలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అయితే చంద్రబాబు మాత్రం టీటీడీపీపై ఆశలు వదులుకొలేదనే సంకేతాలు పంపిస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా టీటీడీపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి.. వారికి సూచనలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంలో భాగంగా ఏపీపై దృష్టి సారించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీపై ఉన్న ఆంధ్ర పార్టీ ముద్రను తొలగించి.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చాలా కాలంగా తెలంగాణలో టీడీపీని వీడినవారే తప్ప.. చేరినవారు ఎవరూ లేరు. అలాంటిది శుక్రవారం గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా జడ్మీ చైర్మన్ గా పని చేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనను చంద్రబాబు నాయుడు పార్టీలో ఆహ్వానించారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.