తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు, వాతావరణ శాఖ యెల్లో హెచ్చరిక..

By SumaBala Bukka  |  First Published Oct 15, 2022, 12:25 PM IST

తెలంగాణలోని అనేక జిల్లాల్లో నేడు భారీ వర్షాలున్నాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. యెల్లో అలర్ట్ ను ప్రకటించింది. 


హైదరాబాద్ :  తెలంగాణలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, జనగామ,  యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్,మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  వారం రోజుల్లో తెలంగాణ నుంచి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని పేర్కొంది. హైదరాబాద్లో మరో రెండు రోజుల పాటు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆతర్వాత తగ్గుముఖం పట్టి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై నగరంలో పలుచోట్ల జల్లులు పడుతున్నాయని పేర్కొంది. ఈ నెల 18 ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

Latest Videos

హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు..

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఓ బైకర్ వరద నీటిలో కొట్టుకుపోయిన విషయం అక్కడి స్థానికులు తీసిన వీడియోలో రికార్డయ్యింది. అయితే అతడిని సకాలంలో గమనించిన స్థానిక వ్యక్తి రక్షించాడు. వరద నీటితో పొంగి పొర్లుతున్న వీధిలో నుంచి వెళ్ళడానికి అతను ప్రయత్నించాడు. దీంతో బండి అదుపుతప్పింది. ఆ వ్యక్తి బండిమీదినుంచి పడిపోయాడు. నీటి ప్రవాహానికి బండి కొట్టుకుపోయింది. ప్రవాహంలో అతను కూడా కొట్టుకుపోయేవాడే.. ఇంతలోనే అక్కడికి దగ్గర్లో ఉన్న మరో వ్యక్తి గమనించి అతడిని పక్కకు లాగడంతో బతికి బయటపడ్డాడు. 

ఈ ఘటన నగరంలోని బోరబండ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియోలో రోడ్లు నీట మునిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వర్షానికి చాలా దుకాణాల షట్టర్‌లు మూసేసి కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహానికి ఆటోలు కొట్టుకుపోతున్నాయి. పార్క్ చేసిన ఉన్న టూ వీలర్లు కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు స్తానికులు నానాతంటాలు పడ్డారు. ఒక కారు రోడ్లలో ఒకదానిని బ్లాక్ చేసింది, అది పార్క్ చేసిన ప్రాంతంనుంచి వరదనీటిలో కొట్టుకుపోయి వచ్చి అక్కడ స్టక్ అయి ఉండొచ్చు.హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. 

click me!