కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

By ramya NFirst Published Mar 6, 2019, 10:49 AM IST
Highlights

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి దంపతులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రాణాపాయం నుంచి వీరు బయటపడ్డారు. 

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి దంపతులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తృటిలో ప్రాణాపాయం నుంచి వీరు బయటపడ్డారు. ద్యుదాఘాతానికి గురైన ఓ మహిళను రక్షించే ప్రయత్నంలో ఎమ్మెల్యే దంపతులూ విద్యుదాఘాతానికి గురయ్యారు. అయితే.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శాలిగౌరారం మండలం చిత్తలూరులో శ్రీ శాంభవి శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకలో రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. కల్యాణ వేదికపై రాజగోపాల్‌రెడ్డి, ఆయన భార్య లక్ష్మిని సన్మానిస్తున్న సందర్భంగా లైటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తెగి ఓ భక్తురాలికి తగిలింది. ఆమె షాక్‌తో గిలగిలా కొట్టుకుంటుండగా గమనించిన ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు.
 
ఆమెకు కూడా షాక్‌ కొట్టడంతో కింద పడిపోయారు. భార్యను రక్షించే ప్రయత్నంలో రాజగోపాల్‌రెడ్డి కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన ఆలయానికి వచ్చిన భక్తులందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. కాగా.. తమకు ఏమీ కాలేదని రాజగోపాల్ రెడ్డి భక్తులకు ధైర్యం చెప్పారు. 

click me!