
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే కోమటి రెడ్డి విషయంలో ఇంకా ఏ క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ లో సుధీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న ఆయన.. బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. పలు సందర్భాల్లో ఈ వాదనను తిప్పికొట్టిన రాజ్ గోపాల్ రెడ్డి.. అంతర్గతంగా మాత్రం పార్టీ మారేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై దుండగుల దాడి: పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు
రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వడం పట్ల ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయం పలు మార్లు ఆయన తన సన్నిహితుల వద్ద కూడా వెల్లడించారు. తెలంగాణలో పలు పార్టీల్లోని ముఖ్యమైన నాయకులను తనలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీని కోమటిరెడ్డి వ్యవహారంలో కూడా వేగంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఆయన బీజేపీలో చేరడం స్పష్టమైనట్టుగా కొంత కాలంగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
పార్టీ మారేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అనుచరులతో మండలాల వారీగా ఆయన ఇటీవల సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఆగస్టు మొదటి వారంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా ఈ విషయంలో స్పష్టత వచ్చినట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆయనను చేజార్చుకోవడం ఇష్టం లేదు. అందుకే ఆయనతో పలువురు ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. పార్టీ మారకుండా ఉండేందుకు బుజ్జగింపులు కూడా జరిపారు. కానీ ఆయన బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపారని, అదే విషయాన్ని వారితో స్పష్టంగా చెప్పారని తెలిసింది.
కాగా.. పార్టీ మారే అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత సమయం తీసుకోవాలని రాజ్ గోపాల్ రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది. తాము ఢిల్లీ నాయకులతో మాట్లాడి నిర్ణయం చెపుతామని రాష్ట్ర నాయకులు ఆయనకు వెల్లడించారు. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ఈ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డి విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తెలియజేసిన తరువాత.. ఆమె నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. కోమటిరెడ్డికి సంబంధించిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక రూపంలో అందజేయనున్నారు. ఈ తతంగం పూర్తి అయిన తరువాతే మిగితా చర్యలు ఉండనున్నాయి.
నిన్న 11 గంటల విచారణ: నేడు కూడా చీకోటి ప్రవీణ్ ను విచారించనున్న ఈడీ
ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ముఖ్యమైన మీటింగ్ జరిగింది. ఇందులో మునుగోడు అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి పలువురు ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. అనంతరం వారంతా విలేకరులతో మాట్లాడారు. తమ సమావేశంలో మునుగోడు అంశాన్ని చర్చించామని చెప్పారు. అతి త్వరలో తమ తదుపరి కార్యచరణ ఉంటుందని చెప్పారు.