
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విమర్శలు గుప్పించారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అమరుల స్పూర్తి యాత్రలో ఇలా మాట్లాడారు. బోధ్ లో జరిగిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు.
నువ్వు సక్కగ లేవు కాబట్టే నాకు పని పడింది. నువ్వు సక్కగ ఉంటే నేను ఎందుకు మాట్లాడత. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనందరం కలిసి తెచ్చుకున్నం. దీన్ని బాగుచేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మన ఓట్లతో వచ్చిన సర్కారు కాబట్టి మనకు కొట్లాడే అధికారం ఉన్నది. నువ్వు చేయాల్సిన పనిచేస్తలేవు కాబట్టి మేము జనాల్లోకి పోతున్నం.
మీరు మమ్మల్ని దొంగల లెక్క చూస్తున్నరు కదా? మరి మేము మిమ్మల్ని ఎట్లా చూడాలి.? నేనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నవు. నువ్వు నెంబర్ వన్నో కాదో జనాలు చెప్పాలె. మాకు సౌకర్యాలు కల్పిస్తే నువ్వు నెంబర్ వన్. మా పిల్లలకు నౌకర్లు దొరికితే నువ్వు నెంబర్ వన్. ఇక్కడ కూరగాయాలు దాసుకోవడానికి కోల్డ్ స్టోరేజి వస్తే నువ్వు నెంబర్ వన్.
ఇన్నిరోజులు ఆంధ్రా కాంట్రాక్టర్లు దోచుకున్నరు. మరి తెలంగాణ వచ్చినంక కూడా వాళ్లే దోసుకుపోతున్నరు కదా? మన సొమ్ము ఎటు పోతున్నది? ఇదేమీ నీ సొంత సొమ్ము కాదు గదా? ఇందులో ప్రతి పైసా జనాలదే. నీ దందాలు చేసుకోవడానికి ఈ పైసలు వాడత అంటే ఎట్లా?
టివిలు వాళ్లయేనాయే, పేపర్లు వాళ్లయేనాయే. పేపర్లు, టీవీల బడ్జెట్టే 500 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నరు. మనం కూడా సోషల్ మీడియాలో మనం చెప్పదలుచుకున్నది చెబుతున్నం. మీరు, మేము కలిస్తేనే తెలంగాణ బాగుపడతది. చేయాల్సిన వాడు చేయకుండా వదిలేసినప్పుడు మనం ఊరుకుంటే ఎలా?
ఇలా అనేక అంశాలపై కోదండరాం స్పూర్తియాత్రలో సర్కారు తీరును ఎండగట్టారు.