గజ్వెల్ కోటపై కోదండం గురి

Published : Jul 12, 2017, 12:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
గజ్వెల్ కోటపై కోదండం గురి

సారాంశం

కెసిఆర్ ఇలాకా మీద కోదండరాం గురిపెట్టారు. గజ్వెల్ కోటలో జెఎసి జెండా ఎగరవేయడానికి రంగం సిద్ధం చేశారు. గజ్వెల్ లో కాలుమోపి తడాఖా చూపాలని ఊవ్విళ్లూరుతున్నది జెఎసి. కోదండరాం గజ్వెల్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం మూడో విడత అమరుల స్పూర్తియాత్రకు సిద్ధమవుతున్నారు. మూడోదశ సిఎం కెసిఆర్ సొంత నియోజకరవ్గం గజ్వెల్ లోనే జరిపేందుకు జెఎసి ప్లాన్ చేస్తోంది. ఈనెల 23వ తేదీన మూడోదశ స్పూర్తి యాత్ర చేపట్టేందుకు జెఎసి సూత్రప్రాయంగా నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో యాత్ర షెడ్యూల్ ను ప్రకటించనుంది జెఎసి.

 

జయశంకర్ సార్ వర్థంతి రోజున అమరుల స్పూర్తి యాత్రను ప్రారంభించారు కోదండరాం. తొలి దశలో సంగారెడ్డి నుంచి సిద్ధిపేట వరకు యాత్ర చేపట్టారు. హరీష్ రావు కంచుకోటలో జెఎసి జెండా ఎగరువేసింది. ఊరు ఊరునా జెఎసికి అపూర్వ స్వాగతం లభించింది. జనాల మంచి రెస్పాన్స్ దక్కించుకుంది జెఎసి.

 

తొలి దశ అంతా హరీష్ రావు కోటరీలోనే సాగింది యాత్ర. ఇక రెండో దశలో మంత్రి కెటిఆర్ కోట మీద జెండా ఎగురువేసింది జెఎసి. సిరిసిల్ల జిల్లాలో జరిగిన యాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. జనాలు భారీ సంఖ్యలో కోదండరాం పర్యటనకు వచ్చి మద్దతు తెలిపారు. మహిళల స్పందన జెఎసి అనుకున్నదానికంటే భారీగా వచ్చింది.

 

రెండు దశల అమరుల స్పూర్తి యాత్రలు పూర్తి చేసుకున్న జెఎసి మూడో దశ కెసిఆర్ సొంత నియోజకవర్గం గజ్వెల్ మీద గురిపెట్టింది. గజ్వెల్ లో యాత్ర చేపట్టి సిఎం కెసిఆర్ కు గట్టి సవాల్ విసిరే యోచనలో ఉంది జెఎసి. అమరుల స్పూర్తి యాత్ర అగ్రనేతలైన కెసిఆర్ కుటుంబసభ్యుల ప్రాతినిథ్యం ఉన్న ప్రాంతాల్లో చేపట్టడం చూస్తే రాజకీయంగా పెద్ద చర్చను లేవనెత్తుతోంది. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు కోటల్లో యాత్రలు చేట్టిన తీరు చూస్తే రాజకీయంగా జెఎసి సర్కారు తీరును ఎండగట్టడంలో ముందుంది అనే ఇంప్రెషన్ ను జనాల్లో కలిగిస్తోంది. వరుస యాత్రలు కుటుంబసభ్యుల కంచుకోటల్లోనే చేపడుతున్న జెఎసి నాలుగో యాత్ర కెసిఆర్ కుమార్తె, ఎంపిగా ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఉండే అవకాశముందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

 

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పెద్దగా పోరాడుతున్న దాఖలాలు లేవు. కేవలం మీడియాలో మాటల యుద్ధానికి దిగుడు తప్ప బాధిత జనాల పక్షాన చేసిన పోరాటాలు లేవనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనేక మంది బంగారు తెలంగాణ నిర్మాణం కోసమంటూ అధికార పార్టీలో చేరిపోయారు. ఇక టిడిపిలోనూ చాలా మంది ఎమ్మెల్యేలు బంగారు తెలంగాణ సాధించడం కోసమే అధికార పార్టీలో చేరామంటున్నారు.

 

ఇక వామపక్షాలు, టిడిపి పార్టీలు ఎంతో కొంత పోరాటం చేస్తున్నాయి. అయినా బలమైన ప్రతిపక్షం అనేది లేని వాతావరణం తెలంగాణలో నెలకొంది. ఈ తరుణంలో గత కొంతకాలంగా జెఎసి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోశిస్తోంది. జెఎసి అమరుల యాత్ర తో సర్కారుపై యుద్ధభేరి మోగించింది. మాటల్లో కాఠిన్యం, విమర్శల్లో పదును పెంచింది జెఎసి. సిఎం కెసిఆర్ అయితే ఫామ్ హౌస్ లో లేకపోతే ప్రగతి భవన్ లోనే ఉంటున్నాడని, జనాల బాధలు పట్టడంలేదని ఘాటైన ఆరోపణలు చేశారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. కమిషన్ల కోసం, కుటుంబ సభ్యుల లాభం కోసమే సిఎం పనిచేస్తున్నారంటూ తీవ్రత డోసు పెంచి విమర్శలు గుప్పించారు.

 

మరి మూడో దశ యాత్రలో సర్కారుపై జెఎసి ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu