
జూన్ నెల 29 నుంచి 30 వరకు జరగాల్సిన గురుకుల పిజిటి మెయిన్స్ పరీక్షను జులై 18 నుంచి 20 వరకు జరపనున్నట్లు గతంలో ప్రకటించింది టిఎస్సీపిఎస్సీ. అలాగే జులై 4 నుంచి 6 వరకు జరగాల్సిన టిజిటి మెయిన్స్ పరీక్షను జులై 20 నుంచి 22వరకు జరపనున్నట్లు సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు జులై 18న జరపనున్నట్లు టిఎస్సీఎస్సీ అధికారికంగా పేర్కొన్నది.
కానీ పిజిటి మెయిన్స్ పరీక్షలు ఈనెల 18 నుంచి అంటే కేవలం ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఐదు రోజుల్లో ఇంకా సెంటర్లు ఫైనల్ చేయాలి. అభ్యర్థులకు హాల్ టికెట్లు ఇష్యూ చేయాలి. సాధారణంగా ఏ పరీక్షకు అయినా వారం రోజులకు ముందే హాల్ టికెట్లు అభ్యర్థుల చేతికి అందుతుంటాయి. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు కనీసం రెండు లేదా మూడు రోజుల సమయం ఇస్తుంటారు. కానీ 12వ తారీకు వరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇక టిజిపి మెయిన్స్ కూడా ఎక్కువ దూరంలో ఏమీ లేవు. జులై 20 నుంచి 22 వరకు సబ్జెక్టుల వారీగా ఆ పరీక్షలు జరగనున్నాయి. వాటికి చూసుకున్నా సమయం మరో 7 రోజులే మిగిలి ఉంది. అందులో ఒకరోజు ఆదివారం కూడా ఉంది. అంటే కేవలం 6 వర్కింగ్ డేస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పిడి పరీక్ష సైతం ఈనెల 18నే ఉంది.
అభ్యర్థులు తమకు ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని మరో 60 రోజుల సమయం ఇచ్చి మొత్తం కలిపి 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయు లో దీనిపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే టిఎస్సీపిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణిని కలిసి అభ్యర్థులు ఒక వినతిపత్రం సమర్పించారు.
మొన్న అభ్యర్థులు కోరిక మేరకు 15రోజుల పాటు పరీక్షలు వాయిదా వేసినట్లు టిఎస్సిపిఎస్సీ ప్రకటించింది. కానీ వాస్తవానికి ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడిలో ఆలస్యం అయినందున మెయిన్స్ ను వాయిదా వేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడ అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి వాయిదా వేయాలని వారు అంటున్నారు.
కానీ పరిణామాలు చూసినా, టిఎస్సిఎస్సీ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటికిప్పుడు పరీక్షలు వాయిదా వేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఒకవేళ సిఎం స్థాయిలో వాయిదా నిర్ణయం తీసుకుంటే చెప్పలేము తప్ప అలాంటిది లేకపోతే తాము షెడ్యూల్ ప్రకారమే వెళ్తామన్నట్లు టిఎస్పీఎస్సీ వర్గాలు అంటున్నాయి. మరి అలాంటప్పుడు హాల్ టికెట్లు జారీ చేసినా అభ్యర్థుల్లో సగం టెన్షన్ తగ్గిపోతుంది కదా అన్న వాదనా వినిపిస్తోంది.