కెటిఆర్ కోట వైపు కోదండ చూపు

First Published Jun 27, 2017, 3:51 PM IST
Highlights

అమరుల స్పూర్తి యాత్ర మొదటి దశ విజయవంతమైందని తెలంగాణ జెఎసి భావిస్తోంది. ఇక రెండో  దశ స్పూర్తి యాత్రకు సన్నాహాలు చేస్తోంది  జెఎసి. తొలి దశలో హరీష్ రావు ఇలాకాలో జెండా ఎగురవేసిన జెఎసి ఇక రెండో దశ యాత్రను కెసిఆర్ తనయుడు, రాష్ట్ర ఐటి మంత్రి నియోజకవర్గమైన సిరిసిల్లను ఎంచుకోనుంది. సిరిసిల్ల నుంచి జెఎసి రెండో దశ స్పూర్తియాత్రను షురూ చేసి కెసిఆర్ కుటుంబానికి హెచ్చరిక పంపే యోచనలో జెఎసి ఉంది.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత సిఎంగా కెసిఆర్ ఎన్నకయ్యారు. ఆయన కుమారుడు కెటిఆర్ మంత్రిగా, అల్లుడు హరీష్ రావు ఇంకో మంత్రిగా కెసిఆర్ అవకాశమిచ్చారు. ఇక కెసిఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపిగా గెలిచారు. దీంతో ఒకే కుటంబంలో నలుగురికి పదవులు లభించాయని విపక్సాలు కూడా అప్పుడో  ఇప్పుడో విమర్శలు చేస్తున్న పరిస్థితి తెలంగాణలో ఉంది.

 

ఇక జెఎసి రెండేళ్లపాటు ప్రభుత్వంతో ఘర్షణ వైఖరితో కాకుండా అధ్యయనం, సూచనలు, సలహాలు తరహాలో వ్యవహరించింది. మూడో ఏట మాత్రం జెఎసి  విశ్వరూపం చూపుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా అమరుల స్పూర్తి యాత్రకు తొలివిడత శ్రీకారం చుట్టిన జెఎసి 4రోజుల పాటు కెసిఆర్ సొంత జిల్లాలో పర్యటించింది.

 

సంగారెడ్డి టు సిద్ధిపేట తొలి విడత యాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా జెఎసి ఛైర్మన్ సర్కారు తీరు పట్ల కఠినమైన పదజాలం ఉపయోగించారు. కెసిఆర్ ఫామ్ హౌజ్ లో లేదా ప్రగతి భవన్ లోనే గడుపుతున్నరంటూ విరుచుకుపడ్డారు. కెసిఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని, మిషన్ భగీరథ పనికిమాలిన పథకం అని పరుషమైన విమర్శలు గుప్పించారు కోదండరాం.

 

ఇక రెండో విడత జెఎసి యాత్ర కెటిఆర్ కోట నుంచే షురూ చేయాలని జెఎసి భావిస్తోంది. కెటిఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ఈ యాత్రను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది జెఎసి. సిరిసిల్ల నియోజకవర్గం కెటిఆర్ కు కంచుకోట ఏమీ కాదు. హరీష్ రావు కు సిద్ధిపేటలో ఉన్నంత పాపులారిటీ కెటిఆర్ కు సిరిసిల్లలో లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కెటిఆర్ కేవలం 140 ఓట్లతోనే అక్కడ గెలుపొందారు. తర్వాత మెజార్టీ పెరిగినా పెద్దగా ఆ నియోజకవర్గంలో కెటిఆర్ పట్టు సాధించలేకపోతున్నారని టిఆర్ఎస్ శ్రేణుల్లో ప్రచారం ఉంది.

 

ఇక జెఎసి అక్కడి నుంచి రెండో దశ స్పూర్తి యాత్ర చేపడితే కచ్చితంగా కెసిఆర్ కుటుంబ పాలనపై జెఎసి జరుపుతున్న పోరాటంగానే జనాలు దీన్ని రిసీవ్ చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

click me!