నేడే ఎన్నిక: హైదరాబాద్ మేయర్ గా కేకే కూతురు విజయలక్ష్మి?

By telugu teamFirst Published Feb 11, 2021, 8:54 AM IST
Highlights

హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ెఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. టీఆర్ఎస్ ఆ రెండు పదవులను కూడా దక్కించుకునే అవకాశం ఉంది. ఆ పదవులకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు.

హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ ఎన్నిక గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. తొలుత కొత్త ఎన్నికైన కార్పోరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక జరుగుతుంది. మేయర్ పదవిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దక్కించుకునే అవకాశం ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్ల ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

మేయర్ గా రాజ్యసభ సభ్యుడు గద్వాల విజయలక్ష్మి పేరును టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ కార్పోరేటర్ గా విజయం సాధించారు. శ్రీలత శోభన్ రెడ్డి తార్కాక నుంచి కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు.

మేయర్ ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు బల్దియాలో జరిగాయి. మేయర్ ఎన్నికకు ముందు టీఆర్ఎస్ కార్పోరేటర్లు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వారికి మార్గనిర్దేశం చేస్తారు. దీంతో కార్పోరేటర్ల తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి టీఆర్ఎస్ కార్పోరేటర్లు సమావేశానికి వెళ్లనున్నారు. 

ఇదిలావుంటే, జిహెచ్ఎంసీలో 44 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. వీరిలో పది మంది ఎంఐఎంకు, 32 మంది టీఆర్ఎస్ కు చెందినవారు.  ఇద్దరు బిజెపికి చెందినవారు. జిహెచ్ఎంసీ సమావేశం గదిలో 193 మందికి సీట్లు ఏర్పాట్లు చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యులకు ముందు వరుసలో సీట్లు ఏర్పాటు చేశారు. 149 మంది కార్పోరేటర్లు ఉన్నారు. 

జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బిజెపి కూడా పోటీ చేస్తోంది. బిజెపి కార్పోరేటర్లు హైదరాబాదులోని బషీర్ బాగ్ లో గల అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు అక్కడి నుంచి వారు సమావేశానికి వెళ్లనున్నారు.

ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి ఎంఐఎం బలం 54 ఉంది. బిజెపి బలం 49 ఉంది. టీఆర్ఎస్ కు 56 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి టీఆర్ఎస్ కు 70 మంది మద్దతు ఉంటుంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులను టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. 

click me!