తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం.. కిషన్ రెడ్డి

Published : Aug 27, 2023, 05:11 PM IST
 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ సమస్యలన్నీ  పరిష్కరిస్తాం.. కిషన్ రెడ్డి

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో భారీ బహిరంగ సభను  నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సభ వేదికగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు విశ్వాసం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలిపారు. నిజాం హయాంలో రజాకార్లు హిందువులను ఏ విధంగా ఊచకోత కోశారనేది ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా పేరొందిన అమిత్ షా నేతృత్వంలో తొలిసారిగా తెలంగాణ  విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. తెలంగాణ విమోచన ఉత్సవాల విషయంలో నిర్లక్ష్యం వహించాయని మండిపడ్డారు. 

సీఎం కేసీఆర్ వ్యవసాయం పండగ అన్నారని.. కానీ నేడు వ్యవసాయం దండగ అనే పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలోని  లక్షలాది మంది కౌలు రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడం లేదని విమర్శించారు. వరి పంట వేయవద్దని ప్రభుత్వమే  చెబుతుందని మండిపడ్డారు. ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారని అన్నారు. 

రైతు రుణమాఫీని నాలుగేళ్లుగా ఆపేసి.. ఎన్నికలు ఉన్నాయని తూతూ మంత్రంగా రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. నాలుగేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీల పేరుతో బ్యాంకులు రైతుల నడ్డివిరిచాయని అన్నారు. 

ధరణి పరిస్థితి.. కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక పోయినట్టుగా మారిందని విమర్శించారు. ధరణి పోర్టల్ కారణంగా 20 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా పాలించిందని.. అది సోనియా కుటుంబం కోసం పనిచేస్తే, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌‌కు వేసినట్టేనని.. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి వేసినట్టేనని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకే తాను ముక్కలు  అని విమర్శించారు. 

తెలంగాణలో మార్పు రావాలంటే, ప్రజల బతుకు బాగుపడాలంటే, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. రైతంగానికి అండగా బీజేపీ నిలబడుతుందని.. రైతులంతా బీజేపీని ఆదరించాలని కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !