Kishan Reddy: ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు 

By Rajesh KFirst Published Jul 31, 2022, 7:39 PM IST
Highlights

Kishan Reddy: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Kishan Reddy: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి జాతీయ పతాక స్ఫూర్తిని బలంగా చాటాలన్నారు.

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శతజయంతి సందర్భంగా ఆగస్టు 2న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన స్మారకార్థం తపాలా బిళ్ల ఆవిష్కరణ, పింగళి రూపొందించిన  జాతీయ జెండా ప్రదర్శన, అతని కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 

ఆగస్టు 3న ఢిల్లీలో తిరంగా యాత్ర.. 9 నుంచి 13వ తేదీ వరకు ప్రభాతభేరీల పేరిట.. ప్రతి పల్లె, పట్టణం, నగరాల్లో ప్రదర్శనలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలను కోరామన్నారు. దేశ విభజన సందర్భంగా.. ఆగస్టు 14వ తేదీన పెద్ద ఎత్తున మారణహోమం జరిగిందని, ఆరోజు ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడంతోపాటు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 

జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ప్రతిపాదన వచ్చినట్లు తనకు తెలియదన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల శతాబ్ది ఉత్సవాలను కేంద్రం ప్రభుత్వమే నిర్వహించనుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

సీఎం కేసీఆర్ పై కిష‌న్ రెడ్డి ఫైర్ 

సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా  సచివాలయానికి రాలేదని, ఆయ‌న 20 రోజులు ఫామ్‌ హౌస్ లో.. 10 రోజులు ఇంట్లో ఉంటారని విమ‌ర్శించారు. గత ఎనిమిది ఏండ్ల కిత్రం రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని ఉండేవారని కానీ.. ఆ ప‌రిస్థితులు మారాయ‌ని అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీ .. గ‌త 8 ఏళ్లుగా ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని అన్నారు. 

click me!