
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుననట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచన 75 ఏళ్లను పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించనున్నట్టుగా చెప్పారు.సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్టుగా చెప్పారు. ఈ వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఆహ్వానాలు పంపినట్టుగా చెప్పారు.
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందింది.. కానీ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం అప్పుడు స్వాతంత్య్రం రాలేదని అన్నారు. భారత్‌లో కలిసేందుకు నిజాం నిరాకరించారని చెప్పారు. నిజాం పాకిస్తాన్‌లో కలిసేందుకు ప్రయత్నాలు చేశాడని అన్నారు. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాలు, కర్ణాటకలో ఉన్న మూడు జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలో నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంగా కొనసాగేవని చెప్పారు. ఆనాడు నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థాన ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు.
రజకార్ల దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని వేలాది మంది ప్రజలు ఉద్యమ బాట పట్టారని తెలిపారు. రజకార్లు ప్రజలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, దోపిడిలకు పాల్పడ్డారని చెప్పారు. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నాటి కేంద్ర హోంమత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ త్వరితగతిన, సమయానుగుణంగా తీసుకున్న చర్యలవల్లే హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించింది.
నిజాం హత్యాకాండకు, దౌర్జన్యానికి బలైన సామాన్య ప్రజలకు, స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన అమరవీరులకు నిజమైన నివాళలర్పిండం, వారు చేసిన త్యాగాలను, శౌర్య, పరాక్రమాలను ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రజాకార్లుగా ఉన్నవాళ్లు ఎంఐఎంగా అవతరించారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీని గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారని విమర్శించారు. అందుకే ఈ చరిత్రను ఇన్నేళ్ల పాటు తొక్కిపెట్టారని అన్నారు.